సంక్షోభంలో ఎయిర్ లైన్స్‌ టిక్కెట్లకు రెక్కలు

ఒక సంస్థకు పైలట్ల కొరత. మరో సంస్థకు నిధులు లేవు. తాజాగా బోయింగ్‌‌‌‌ మ్యా క్స్‌ 737 సంక్షోభం…ఇలా దేశీయ విమానయాన రంగంలోని కంపెనీలన్నీ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. విమానయాన సంస్థలు నిలిపివేసే విమానాల సంఖ్య పెరిగే కొద్దీ ప్యాసింజర్లకు టికెట్ల భారం పెరుగుతుంది. వేసవి సెలవులలో విమాన ప్రయాణం కనీసం 20 శాతం ఖరీదవుతుందని అంచనా. విద్యార్ధులకు సెలవులు కావడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి టూర్స్‌ కు ఇదే అనువైన సమయంగా భావిస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే టికెట్‌‌‌‌ ధరలు పెరగనున్నాయి. కనీసం 50 విమానాలు వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని యాత్రా ఆన్‌ లైన్‌ సీఓఓ శరత్‌ ధాల్‌‌‌‌ చెప్పారు. దేశీయ విమాన పరిశ్రమ సామర్థ్యంలో ఇది 8 శాతానికి సమానమనితెలిపారు.

రుణాల ఊబిలో కూరుకుపోయిన జెట్‌‌‌‌ ఎయిర్వేస్‌‌‌‌ లీజులు చెల్లించలేక, 40 శాతం విమానాలను నిలిపివేసింది. 12 బోయింగ్‌‌‌‌ 737 మ్యాక్స్‌లను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు స్పైస్‌‌‌‌ జెట్‌‌‌‌ ప్రకటిం చింది. ఇటీవలే రెండు బోయింగ్‌‌‌‌ 737 మ్యాక్స్‌ లు కూలిపోయిన నేపథ్యంలో ఇండియా ప్రభుత్వం కూడా వాటిని నిషేధించింది. నిపుణులైన పైలట్ల కొరతతో సతమతమవుతున్న ఇండిగో ఎయిర్‌‌‌‌లైన్స్‌ రాబోయే రెండు నెలల్లో రోజూ డజన్ల కొద్దీ సర్వీసులను నిలిపి వేయనుంది. మరోవైపు దేశంలో విమాన ప్రయాణం భారీగా పెరిగింది. దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య జూన్‌ 2018 దాకా వరసగా 46 నెలలపాటు రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. 2024 నాటికి ప్రపంచంలోనే మూడో పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌‌‌‌గా ఇండియా అవతరిస్తుందని ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ట్రాన్స్‌ పోర్ట్‌‌‌‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది.

బోయింగ్ 737 మ్యాక్స్‌ విమానాలను బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఇండియాలో నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ విమానాల సేవలను నిలిపివేయమని సివిల్‌‌‌‌ ఏవియేషన్‌ డైరెక్టరేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆదేశించింది. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా వంటి 13 దేశాలు ఇప్పటికే బోయింగ్ 737 మ్యాక్స్‌ ఆపరేషన్స్‌ను నిలిపివేశాయి. మంగళవారం రాత్రే నిలుపుదల
ప్రకటనను సివిల్‌‌‌‌ ఏవియేషన్‌ డైరెక్టరేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ జారీ చేసింది.

ఎలాంటి ఛార్జీలు లేకుం డా స్పైస్‌‌‌‌జెట్ ఆఫర్లు….
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆపివేయాలంటూ డీజీసీఏ జారీ చేసిన ఆదేశాలను కట్టుబడి ఉన్నామని స్పైస్‌‌‌‌జెట్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి బోయింగ్ 737 ఎన్‌ జీ, బంబార్డియర్ క్యూ400 ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లను సమర్థవంతంగా వాడుతున్నట్టు స్పైస్‌‌‌‌జెట్ పేర్కొంది. తమ ప్రయాణికులకు తలెత్తే అసౌకర్యాలను తగ్గిస్తున్నామని చెప్పింది. అదనపు విమానాలు,
కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లను ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని తెలిపింది. త్వరలోనే తమ కార్యకలాపాలన్నీ యథాతథ స్థితికి వస్తాయని చెప్పింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఆపివేయడంతో ప్రభావితమవుతున్న ‌ప్రయాణికులకు స్పైస్‌‌‌‌జెట్ ప్రత్యామ్నాయ విమానాలను సిద్ధం చేస్తోంది. అంతేకాక ప్రయాణికులకు ఫుల్ రి ఫండ్ ఆప్షన్‌ ను, విమానాన్ని లేదా ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశాన్ని, డెస్టినేషన్ మార్చుకోవడం వంటి పలు సేవలను కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా స్పైస్‌‌‌‌జెట్ ఆఫర్ చేస్తోంది.