రాజ్యసభకు వృద్ధుడి నామినేషన్

రాజ్యసభకు వృద్ధుడి నామినేషన్

హైదరాబాద్, వెలుగు: ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం తన భూమిని అన్యాయంగా గుంజుకుంటున్నారంటూ మహబూబ్​నగర్​కు చెందిన వృద్ధుడు రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఆఫీస్​లో శుక్రవారం తీన్మార్ మల్లన్నతో కలిసి హన్వాడకు చెందిన దళితుడు చిన్న మాసయ్య నామినేషన్ పేపర్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న మాసయ్య మీడియాతో మాట్లాడారు. “సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్​లు తమకున్న కొంత భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం గుంజుకుని.. నానా కష్టాల పాలు చేస్తున్నారు. దీనిపై కోర్టులో కూడా పిటిషన్ వేసినం. ప్రాణం పోయినా.. భూమి ఇయ్యబోము. దొరల కాలంలో బాంచెన్​బతుకు బతికినం.. ఇప్పుడు సీఎం కేసీఆర్​ను నమ్మి ఓటు వేసినందుకు తమకు దక్కుతున్నది ఇదేనా?’’ అని ప్రశ్నించారు. తన గోడు ఎవరు పట్టించుకోకపోవడంతోనే అసెంబ్లీకి వచ్చి రాజ్యసభ నామినేషన్​ పత్రాలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఫుడ్​ ప్రాసెసింగ్ పార్క్​పేరుతో మాసయ్యతో పాటు మరో 2వేల మంది దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటున్నదని తీన్మార్‌‌ మల్లన్న ఆరోపించారు. న్యాయం కోసం నామినేషన్ వేసేందుకు సిద్ధమైన మాసయ్యకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దుతు ఇవ్వాలని కోరారు.