యుద్ధం అంటే మాటలు కాదు…

పుల్వామాలో సిఆర్‌‌‌‌‌‌‌పిఎఫ్‌ జవాన్లపై టెర్రరిస్టుల దాడి తర్వాత మనలో చాలామంది తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, ప్రతీకారం తీర్చుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే… అందరిలోనూ ఇదే ధోరణి. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఇందుకు వేదిక, ప్రేరణ కూడా అక్కడే. సాధారణ సమయాల్లో ఇతరుల కష్టాల పట్ల మానవత్వంతో స్పందించేవారు, పదిమందికి సాయపడేవారు, గొప్పవ్యక్తులుగా పేరున్న వారంతా యుద్ధాన్నే కలవరిస్తూ, పలవరించడం ఆందోళన కలిగించింది. నిజమైన యుద్ధం కంటే అందరిలోనూ ఒకే రకంగా యుద్ధకాంక్ష వ్యక్తం కావడం భయం కలిగించింది. స్నేహితులైనా సరే శాంతికోసం మాట్లాడితే, విరోధులుగా భావించే స్థాయికి వారిలో ఉద్రేకం పెరిగిపోయింది. ఈ మార్పుకు కారణం ఏంటీ ? పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం చేయాలని కోరుకుంటున్న వారందరికీ యుద్ధం పర్యవసానాల గురించి తెలుసా? సమర క్షేత్రాల్లోని ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఊహించారా? యుద్ధానంతర ప్రజాజీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అర్థం చేసుకోగలరా ? విధ్వంసకర యుద్ధంలో హీరో చేతిలో తుపాకీతో అజేయునిగా బయటకు రావడం తెలుగుసినిమాల్లో మాత్రమే సాధ్యం.యుద్ధమంటే పాలు, తేనే కలుపుకుతాగడం కాదు. బాహుబలి సినిమా టైప్‌లో ఉండదు. అది మన జీవితాలను, పిల్లల భవిష్యత్తును సర్వనా శనం చేస్తుంది. భారత్‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మధ్య యుద్ధమంటూ జరిగితే నష్టం ఉభయదేశాలకు ఉంటుంది. ఆయుధాలు అమ్ము కునే అమెరికా వంటి దేశాలకు బాగుంటుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఏళ్లుగా మనం సాధిస్తున్న అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటుంది. పేదలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. యుద్ధం వల్ల కలిగే నష్టాలు కొన్ని తరాల పాటు రెండు దేశాల్లోనూ కనిపిస్తాయి.

ప్రపంచంలో యుద్ధం కలిగించే నష్టాలకు అనేక దేశాలు సాక్ష్యం. జీవితాలు ధ్వంసమై, ఉపాధి తుడిచిపెట్టుకుపోయి, కమ్యూనిటీల అస్తిత్వాలే నాశనమై.. అదొక భయానకమైన పరిస్థితి. హిరోషిమా, నాగాసాకి అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆర్థికంగా ఎదుగుతూ, గల్ఫ్‌ దేశాలకు అండగా నిలుస్తూ వచ్చిన సిరియా యుద్ధం కారణంగా సర్వనా శనమైంది. సిరియా చిన్నారులకు సంబంధించిన నెత్తురోడుతున్న చిత్రాలను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలోనే మనం చూశాం . భద్రమైన జీవితాలు కూలిపోయి, ప్రాణాల కోసం చిన్నచిన్న పడవల్లో సముద్రాలను దాటే దుస్సాహసం సిరియన్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ ఎక్కుపెట్టిన యుద్ధం వల్ల పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆధునిక విజ్ఞానంతో మనం ఆకలి, అనారోగ్యంలేని సమాజాన్ని సృష్టించలేకపోయాం గానీ విధ్వంసకరం ఆయుధాలను మాత్రం తయారు చేయగలిగాం . ఏసీ గదుల్లో కూచొని యుద్ధం గురించి కేకలుపెట్టే జర్నలిస్టులు, యాంకర్ల మాటలకు పడిపోకుండా విచక్షణను ప్రతిపౌరుడూ ఉపయోగించాలి. ఇప్పుడు యుద్ధమంటే భారత్‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. మన పొరుగునే ఉన్న చైనాకు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో చైనా కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆర్థిక ప్రయోజనాల రక్షణను ఆ దేశం విస్మరిస్తుందని భావించలేం. యుద్ధం విషయంలోనే కాదు, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా వేదికగా రెండు బాగా దేశాల మధ్య విద్వే షాన్ని రెచ్చగొట్టే చౌకబారు విమర్శలు కూడా మంచివి కావు. బాగా చదువుకున్న వాళ్లు, విశ్వవిద్యాలయ విద్యార్ధులు కూడా విచక్షణను విస్మరించడం సరికాదు.
– అవర్ణ, జెఎన్‌‌‌‌‌‌‌‌యూ ఢిల్లీ