
కరీంనగర్: ఇందుర్తి (హుస్నాబాద్) మాజీ శాసన సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ వెంకటేశ్వర్లు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు బొమ్మ వెంకన్న.
ప్రస్తుత హుస్నాబాద్ సెగ్మెంట్ ఇందుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు బొమ్మ వెంకటేశ్వర్లు 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సీపీఐ కంచుకోట బద్దలుకొట్టిన బొమ్మ వెంకన్న
ఇందుర్తి నియోజకవర్గం ఒకప్పుడు సీపీఐకి కంచుకోట. అక్కడినుంచి సీపీఐ మాజీ సీనియర్ నేత దేశిని చిన్నమల్లయ్య నాలుగుసార్లు గెలుపొందారు. ఆయనపై 1989, 1994ల్లో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు బొమ్మ వెంకటేశ్వర్లు. 1989లో కేవలం 5వందల పైచిలుకు ఓట్ల తేడాతో దేశిని చినమల్లయ్యపై ఓడిపోయారు బొమ్మ వెంకన్న. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో హుస్నాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి చాడ వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు.
వేములవాడ దేవస్థానం చైర్మన్ గా కూడా బొమ్మ వెంకన్న పనిచేశారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి కృషి చేశారు.