- అయోమయంలో ఎమ్మెల్యే వర్గీయులు
- కోవ లక్ష్మికి టికెట్ కేటాయించడంలో కార్యకర్తల పక్క చూపులు
ఆసిఫాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధిష్టానం ఆసిఫాబాద్టికెట్ను జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి కేటాయించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు షాక్ఇచ్చింది. అప్పటివరకు సక్కుకే టికెట్ కన్ఫర్మ్అని భావించిన ఆయన అనుచరులు చివరి క్షణంలో కోవ లక్ష్మికి ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు. ఎంపీ, లేదంటే ఎమ్మెల్సీ స్థానంపైనా సక్కుకు అధిష్టానం నుంచి కచ్చితమైనా హామీ లేదని సమాచారం. అయితే, టికెట్ కేటాయించకపోవడం, ఇతర హామీలేవీ ఇవ్వకపోయినా ఆత్రం సక్కు నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోయింది.
దీంతో ఆయనపై గంపెడు ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. టికెట్ దక్కించుకున్న కోవ లక్ష్మి సైతం సక్కు వర్గీయులను పెద్దగా పట్టించుకోవడం లేదు. టికెట్కేటాయించిన సమయంలో శుభాకాంక్షలు తెలిపినా ముఖం చాటేసుకుని వెళ్లిపోయిందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ నేత వెంట ఉండలేక, ఇటు కోవ లక్ష్మి వెంట వెళ్లలేక సక్కు వర్గం పక్క చూపులు చూస్తోంది.
ఎవరికి లాభం చేకూరేనో..?
ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తల్లో నెలకొన్న ఈ అసంతృప్తి ఎవరికి లాభం చేకూరుతుందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న కోవ లక్ష్మి.. సక్కు వర్గీయులను అంటీముట్టనట్లు చూస్తోంది. సక్కు సైతం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడంతో మారో మార్గం లేక ఈయన వర్గం కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలా, బీజేపీ వైపు వెళ్లాలా అనే ఆలోచనలో పడ్డారు. కొంత మంది కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఆ పార్టీకి కొత్త ఊపు కనిపిస్తోంది.
ALSO READ:తల్లిని కాపాడబోయి కరెంట్ షాక్తో కొడుకు మృతి
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న శ్యాం నాయక్ కు కొందరు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. బీజేపీలో చేరడానికి కొంత మంది ఎదురుచూస్తున్నా ఆ పార్టీ టికెట్ ఎవరికీ ఖరారు చేస్తుందోననే స్పష్టత లేకపోవడంతో వీరంతా వేచి చుసే ధోరణిలో ఉన్నారు. ఒకవేళ సమర్థవంతమైన అభ్యర్థికి టికెట్ ఇస్తే సక్కు వర్గీయులు ఆ అభ్యర్థి చెంతకు చేరే అవకాశాలు ఉన్నాయి. సక్కు ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోతుందా అనే ఆశతో మరికొందరు ఎదురుచూస్తున్నారు.
కార్యకర్తల కృషి వల్లే గెలుపు
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ హావా కొనసాగినా ఆసిఫాబాద్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం సక్కు కార్యకర్తలే. అధికారంలో లేకున్నా సక్కు వెంట నడిచి ప్రజల్లో ఆయనకు మద్దతు కూడగట్టేందుకు విశేషంగా కృషి చేశారు. స్వార్థ ప్రయోజనాలు లేకుండా ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయడంతో సక్కు విజయం సాధించారు. గడిచిన ఐదేండ్లలోనూ వారికి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా తమ నేత వెంటే నడిచారు. కానీ ఇప్పుడు టికెట్ కోవ లక్ష్మికి రావడంతో సక్కు అనుచరుల ఉనికి ప్రశ్నార్థకమైంది. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.