జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు

హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ స్కూళ్లకు చెందిన టీచర్లు, ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల ముగిసి 17 రోజులు దాటినా ఇంకా వేతనాలు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ స్కూళ్లలో దాదాపు 23 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 5 వేల వరకు బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇక సమగ్ర శిక్షా అభియాన్ స్కూళ్లలో 18 వేల వరకు సిబ్బంది పని చేస్తున్నారు. ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు ఇంత వరకు రాకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మన ఊరు మన బడి’ తో స్కూళ్లకు మహర్దశ తీసుకు రానున్నట్లు చెబుతోన్న ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేసోందని వారు ప్రశ్నిస్తున్నారు.

మధ్యాహ్న భోజనం, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదలలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అంటున్నారు. వేతనాలు టైంకు రాకపోవడం వల్ల రూమ్ రెంట్, చార్జీలు, ఈఎమ్ఐలకు ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. తమకొచ్చేది తక్కువ జీతమని, అది కూడా సమయానికి రాకపోవడంతో చాలా కష్టాలు పడుతున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా జీతాలు రిలీజ్ చేయాలని వారంతా కోరుతున్నారు. తక్షణమే జీతాలు విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...

బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు 

సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు