జనాల్ని రెచ్చగొట్టొద్దు: 5% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్న గుజ్జర్ల నేత

Gujjar andolan: Vehicles torched, trains disrupted as community wants 5% quotaజైపూర్: రాజస్థాన్ లో గుజ్జర్లకు చదువు, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆ వర్గం రోడ్డెక్కింది. శుక్రవారం నుంచి చేస్తున్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. రోడ్లపై వాహనాలను తగలబెట్టారు. రైళ్లను అడ్డుకున్నారు. నిరసనకారులు రైలు పట్టాలపై అడ్డంగా కూర్చుని ధర్నాకు దిగారు. దీంతో పదుల సంఖ్యలో రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. మరి కొన్ని రైళ్లను రద్దు చేశారు.

ధోల్పూర్ లో నిన్న తీవ్రమైన హింస చెలరేగింది. వాహనాలు తగలబెడుతున్న ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై వాళ్లు రాళ్లు రువ్వారు. దాన్ని కంట్రోల్ చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి.

హింసను ఖండించిన సీఎం గెహ్లాట్

రాజస్థాన్ లో గుజ్జర్ల ఆందోళనల్లో చెలరేగిన హింసను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. తమ ప్రభుత్వం గుజ్జర్ల నేతలతో చర్చలకు సిద్ధంగా ఉందని, ఆందోళనలను వీడాలని గెహ్లాట్ పిలుపునిచ్చారు.

మోడీపై ఒత్తిడి చేయండి

జనరల్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రధాని మోడీపై ఒత్తిడి చేయాలని నిరసనకారులకు రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ సూచించారు. తమ ప్రభుత్వం వచ్చి కేవలం 45 రోజులే గడిచిందని, అయినా తాము రిజర్వేషన్లకు నో చెప్పడం లేదని అన్నారు. నిరసనకారులు రోడ్లు బ్లాక్ చేస్తే ప్రభుత్వం చేయాల్సిన పని అది చేస్తుందని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు చేయాలని, ప్రభుత్వంతో చర్చలకు రావాలని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ బైంస్లాకు మంత్రి పిలుపునిచ్చారు.

ప్రజల్ని రెచ్చగొట్టొద్దు: గుజ్జర్ల నేత

ఐదు శాతం రిజర్వేషన్లపై ప్రకటన వచ్చాకే నిరసనలను ఆపుతామని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ బైంస్లా స్పష్టం చేశారు. దయ చేసి ప్రభుత్వం ఏ మాత్రం ప్రజలను రెచ్చగొట్టే నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానన్నారు. జనమంతా తన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని, శాంతియుతంగా, వీలైనంత త్వరగా సరైన నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పారు.

Latest Updates