హోలీ నుంచే చైనా వస్తువులు బ్యాన్ చేయాలి : కేంద్రమంత్రి కౌర్

జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా భద్రతామండలిలో చైనా అడ్డుకోవడంపై దేశంలో నిరసనలు పెరుగుతున్నాయి. కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ దీనిపై స్పందించారు. భారత ప్రజలు, సైనికుల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాద సంస్థల అధినాయకులకు చైనా మద్దతుగా నిలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఉగ్రవాద శక్తులకు దూరంగా ఉండాలని చైనాను కోరారు. లేకపోతే… ఈ హోలీ పండుగ నుంచే చైనా వస్తువుల నిషేధం ఇండియాలో అమలవుతుందని ఆమె హెచ్చరించారు.

జేషే మహ్మద్ చీఫ్ అజార్ మసూద్ ను ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి అడ్డుపుల్ల వేసింది చైనా. ఐకరాజ్యసమితిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనకు నో చెప్పింది. పుల్వామా,  ఉరీ,  భారత పార్లమెంటు సహా అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి.. పరోక్షంగా సహకరించి.. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న జైషే మహమ్మద్  చీఫ్  మసూద్  అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్  ప్రయత్నం దీంతో నెరవేరలేదు. మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఇప్పటికే మూడుసార్లు అడ్డుకున్న చైనా.. నాలుగోసారి కూడా సాంకేతిక కారణాలు చూపుతూ ఉగ్రవాదికే ఫేవర్ చేసింది.

పుల్వామా దాడి నేపథ్యంలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత నెల 27న UNలోని అల్ ఖైదా శాంక్షన్స్  కమిటీకి శాశ్వత సభ్య దేశాలు అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్  ప్రతిపాదించాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటూ కమిటీ పది రోజుల గడువు ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ గడువు ముగిసింది. గడువులోపు ఎటువంటి అభ్యంతరాలూ రాకపోతే, మసూద్  అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేది. అయితే, చివరి నిమిషం వరకూ సస్పెన్స్ ను కొనసాగించిన చైనా.. తుది గడువుకు అరగంట ముందు సాంకేతికంగా బ్రేక్ వేసింది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రయత్నాలు నాలుగోసారి కూడా నెరవేరలేదు. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్  విజ్ఞప్తులను భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా 2009 నుంచీ అడ్డుకుంటోంది.