యూ టర్న్.. మహిళలకు నో అబ్జెక్షన్: దేవస్వం బోర్డు

In U-turn, Travancore Devaswom Board says women can enter shrineన్యూఢిల్లీ: శబరిమల వివాదం కొత్త మలుపు తిరిగింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు యూ టర్న్ తీసుకుంది. అన్ని వయసుల్లోని మహిళలకు స్వామి దర్శనం కల్పించేందుకు తమకు అభ్యంతరం లేదని సుప్రీంకు తెలిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని స్పష్టం చేసింది.

ఆలయంలో 10 – 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని గతంలో ఎత్తేస్తూ సుప్రీం ఇచ్చిన తీరుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ నిర్వహణ చూసే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు తన వైఖరి మార్చుకుంటున్నట్లు చెప్పింది. గతంలో ఆలయ సంప్రదాయం ప్రకారం 10-50 మధ్య వయసున్న మహిళలను అనుమతించడం కుదరదని చెప్పిన బోర్డు ఇప్పుడు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. బోర్డు తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది సుప్రీంలో వాదనలు వినిపించారు. సమానత్వం ప్రజలందరి ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం హిందూ సంప్రదాయమని చెప్పారు.

నిషేధాన్ని కోరుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన నాయర్ సర్వీస్ సొసైటీ తరఫు లాయర్ పరాశరన్ ముందుగా వాదనలు వినిపించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు. ఆయన బ్రహ్మచారి కావడం వల్లే కొన్ని వయసుల వారిని మాత్రమే అనుమతించడం లేదని చెప్పారు. దీన్ని అంటరానితనంగా చూడలేమన్నారు.

వాదనలు విన్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను  ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. జనవరి 22నే విచారణకు రావాల్సి ఉంది. కానీ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఇందూ మల్హోత్రా అందుబాటులో లేకపోవడంతో నేటికి వాయిదా పడింది.

అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మధ్య మహిళలను అనుమతించడం శబరిమల ఆలయ సాంప్రదాయాలను దెబ్బతీయడమేనని దాదాపు 60కి రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ధర్మాసనంలో జస్టిస్‌ ఆర్‌ఎఫ్ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు.

శబరిమల ఆలయ సంప్రదాయం ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధం. అయితే ఈ నిబంధన లింగ సమానత్వానికి వ్యతిరేకమని, రాజ్యంగ స్ఫూర్తిని దెబ్బతిస్తోందని కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు 2018 సెప్టెంబరు 28న ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప దర్శనం కల్పించాలని ఆదేశించింది.

అయితే ఈ తీర్పును ఇచ్చిన బెంచ్ లో ఉన్న ఏకైక  మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా ఆ మాత్రం ఇది కోర్టులు తేల్చే విషయం కాదని నాడు చెప్పారు. మత విశ్వాసాలకు సంబంధించిన విషయాన్ని న్యాయస్థానాలు ముట్టుకోకపోవడం మంచిదన్నారు.

సుప్రీం తీర్పుపై పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. విశ్వహిందూ పరిషత్, అయ్యప్ప భక్త సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

నిరసనల నేపథ్యంలో సుప్రీం తీర్పును అమలు చేయడానికి మూడు నెలకు పైగా సమయం పట్టింది. జనవరి 2న కనకదుర్గ (42), బిందు (44) అనే ఇద్దరు కేరళ మహిళలు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అయితే హిందూ సంప్రదాయాన్ని, అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని  కనక దుర్గను ఆమె అత్త ఇంటి నుంచి బయటకు పంపేసింది.

మొత్తం 51 మంది అయ్యప్ప దర్శనం చేసుకున్నారని గత నెలలో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. అయితే ఇద్దరు మహిళలు దర్శించుకున్న విషయం మాత్రమే ప్రభుత్వానికి క్లారిటీ ఉందని సోమవారం కేరళ దేవస్వం మంత్రి సురేంద్రన్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి చెప్పడం గమనార్హం.

Latest Updates