‘మొదటి మహిళా పీఠాధిపతి’ మాతే మహాదేవి శివైక్యం

లింగాయత్ ధర్మ గురు, కర్ణాటకలోని కూడలసంగం బసవధర్మ పీఠాధిపతి.. మాతే మహాదేవి శివైక్యం చెందారు. దక్షిణ భారతంలో మొదటి మహిళా పీఠాధిపతి అయిన మాతే మహాదేవి.. వీరశైవుల పవిత్ర క్షేత్రం కూడల సంగమం పీఠానికి ఆధ్యక్షురాలు. డెబ్భైమూడేళ్ల మాతే మహాదేవి.. కొన్నాళ్ల నుంచి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కూడల సంగమం నుంచి బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం చనిపోయారు. నిన్ననే మాతే మహాదేవి పుట్టినరోజు జరిగింది.

లింగాయత్ ప్రత్యేక ధర్మ ఉద్యమం ఉధృతం కావటానికి ప్రధాన కారణం మాతే మహాదేవి. అభినవ అక్కమహాదేవి అని కూడా మాతే మహాదేవిని లింగాయత్ లు పిలుస్తారు. కర్ణాటకలోని వీరశైవ లింగాయత్ పీఠాల్లో కూడల సంగమ పీఠానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పీఠాన్ని బసవేశ్వరుడు ప్రారంభించారు. మూడు నదుల సంగమమైన ఈ క్షేత్రంలోనే బసవేశ్వరుడు జల సమాధి అయ్యారు. తన 20 ఏళ్ల వయసులోనే వీరశైవ ప్రచారంలో భాగంగా సన్యాసాన్ని స్వీకరించారు మాతే మహాదేవి. వీరశైవ లింగాయత్ ధర్మ వ్యాప్తికి కృషిచేశారు.