గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు వివరించారు అధికారులు. ఈ ఉదయం పారికర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు చెప్పిన అధికారులు.. సాయంత్రం వేళ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఓ ప్రకటన విడుదల చేశారు.  

దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్… గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పదవికి రాజీనామా చేసి.. తన సొంత రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల్లో గెలిచి గోవా సీఎంగా కొనసాగుతున్నారు. పాంక్రియాటిక్ సమస్యతో సుదీర్ఘ కాలంగా బాధపడుతున్నారు మనోహర్ పారికర్. ఢిల్లీలో చికిత్స తీసుకుని గత ఏడాది గోవా చేరుకున్నారు. ముక్కులో ట్యూబ్స్ తో చికిత్స పొందుతున్న టైమ్ లోనే ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొన్నారు. ప్రాజెక్టుల పనితీరును గ్రౌండ్ లెవెల్ లో పరిశీలించారు. అంకితభావం చాటుకున్నారు. 

గోవా సీఎం ఆరోగ్యం మెరుగుపడాలని ఆ రాష్ట్రమంతటా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అధికార పార్టీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తోంది.