అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను వెన్నుపోటు పొడిచారు : మంత్రి ఈటల

హుజారాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలో వెన్నుపోటు పొడిచారని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్. పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ లో 17న జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆయన హుజారాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెప్పారు.  ఎంపీగా వినోద్ కుమార్ ను మరోసారి గెలిపించాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై సోషల్ మీడియాలో విస్తృతంగా అసత్యపు ప్రచారాలు చేశారనీ.. అవన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.

“నాతో మంచిగా ఉన్నట్లు  శాలువాలు కప్పి నా వెనుకాల వేరే విధంగా మాట్లాడుతున్న వారిని క్షమించను. మొన్నటి ఎన్నికలతో నాకు ఎవరేమిటో తెలిసింది. నాకు గ్రూపులు లేవు, కల్మషం లేదు.. ఒకే తల్లీ పిల్లల లాగా కలిసి ఉందాం. అందరూ నా వాళ్లే. 81.6% శాతం ఈ నియోజకవర్గంలో టీఆరెస్ పార్టీ ఉందని కేసీఆర్ అన్నారు. కానీ కొంత మెజార్టీ తగ్గి మొన్నటి ఫలితాలు నిరాశ పరిచాయి. నాకు వెన్నుపోటు పొడిచారు. కానీ టీఆరెస్ పార్టీ కి వెన్నుపోటు పొడవకండి. పార్లమెంట్ ఎన్నికలలో టీఆరెస్ పార్టీకి పట్టం కట్టండి. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా దక్కకుండా చేద్దాం. ఈ నియోజకవర్గ ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపించాలి” అని ఈటల రాజేందర్ అన్నారు.

Latest Updates