
ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక వ్యవస్థపై కనీస అవగాహన లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ను ఆయన నవ్వులపాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ‘యువ ఆక్రోశ్’ పేరుతో మంగళవారం సభ నిర్వహించిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. డీమానిటైజేషన్ వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందా? అని 8 ఏళ్ల చిన్న పిల్లాడిని అడిగినా చెడే జరిగిందని చెబుతాడని అన్నారు రాహుల్.
యూపీఏ హయాంలో 9 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఇప్పుడు 2.5 శాతానికి పడిపోయిందన్నారు. మోడీ ప్రభుత్వం 5 శాతమని అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ప్రధానమంత్రికి ఎకనమిక్స్ గురించి తెలిసినట్లుగా లేదని అన్నారు. ఆయనకు కనీసం జీఎస్టీ అంటే ఎంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు రాహుల్. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు ఉన్న ఇమేజ్‌ను మోడీ దెబ్బతీశారని, ఇప్పుడు మన దేశాన్ని రేప్ క్యాపిటల్‌గా ప్రపంచం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను ఎదుర్కొని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మోడీకి లేదన్నారు. గతంలో చైనాతో పోటీ పడగలిగిన శక్తి ఉన్న భారత్ వెనకబడి పోయిందన్నారు. ప్రపంచంలోనే చైనాతో పోటీ ఇవ్వగలిచేది ఒక్క భారత యువత మాత్రమేనని చెప్పారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధపు హామీలిచ్చిన ఆయన సీఏఏ, ఎన్నార్సీ గురించి తప్ప నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు రాహల్ గాంధీ. గత ఏడాదిలో స్లోడౌన్ కారణంగా యువత సుమారు కోటి ఉద్యోగాలను కోల్పోయారని అన్నారాయన.