మార్స్‌పై మొదటి అడుగు మహిళదే: నాసా

మార్స్ ప్లానెట్ పై మనిషి జీవించడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే.. మనిషిని మార్స్ పైకి  పంపించే ప్రణాళికలను సైంటిస్టులు సిద్ధం చేస్తున్నారు. అయితే…మొదటగా మార్స్‌‌పై ఎవరు అడుగుపెట్టబోతున్నారన్న విషయంపై నాసా స్పందిస్తూ.. మార్స్ పై మొదటి అడుగు వేయనున్నది ఓ మహిళే అని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రైడెన్స్ స్టెన్‌ తెలిపారు. చంద్రుడిపై మరోసారి కాలుమోపే తొలి వ్యక్తి కూడా మహిళే అన్నారు. ఆ మహిళ ఎవరు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రాబోయే ప్రాజెక్టులన్నిటిలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ నెల చివర్లో తొలిసారిగా కేవలం మహిళా ఆస్ట్రోనాట్లు మాత్రమే స్పేస్‌వాక్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్‌వాక్‌ కు, 2013లో ఆస్ట్రోనాట్స్‌గా ట్రైనింగ్ తీసుకున్న ఆనె మెక్‌ క్లెయిన్‌, క్రిస్టినా కోచ్‌ సిద్ధమవుతున్నారని, అంతేకాక.. ఈ మధ్య నాసా నిర్వహిస్తున్న స్పేస్‌ క్లాసులకి ఎక్కువ సంఖ్యలో మహిళలే వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నాసా ఆస్ట్రోనాట్లలో 34 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి రానున్న నాసా ప్రాజెక్టుల్లో మహిళలే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.