నిజాంపేటలో కుప్పకూలిన బిల్డింగ్ స్లాబ్

జీడిమెట్ల, వెలుగు : బిల్డర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలోని స్లాబ్ కుప్పకూలి ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ఈ  ఘటన హైదరాబాద్​ నిజాంపేటలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. నిజాంపేట కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో సర్వే నంబర్ 148, 152లోని 550 గజాల స్థలంలో శ్రీసాయి కన్స్ట్రక్షన్ పేరుతో శంకర్ రెడ్డి అండ్ అదర్స్ హెచ్ఎండీఏ నుంచి స్టిల్డ్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని ఇటీవల పనులు చేపట్టారు. 15 రోజుల కిందట రెండో స్లాబ్ వేశారు.

ALSO READ: పట్టు వీడని మంత్రి.. జాడలేని జానయ్య

బుధవారం మూడో స్లాబ్ వేశారు. సాయంత్రం పనులు ముగుస్తాయనుకుంటున్న టైంలో రెండు, మూడో స్లాబ్ ఒక్కసారిగా కుప్ప కూలింది.  ప్రమాదం జరిగినప్పుడు 40 కూలీలు పనిచేస్తుండగా ఎవరికీ ఏమీ జరగలేదు. ఇద్దరు మహిళా కూలీలు లక్ష్మి, అనితలకు గాయాలవగా..  స్థానిక ఆస్పత్రికి తరలించారు. బిల్డర్​ ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, నాసిరకంగా పనులు చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలపై  క్రిమినల్  కేసులు నమోదు  చేయాలని  నిజాంపేట బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ ​డిమాండ్ చేశారు.