చంద్రయాన్ 3 : విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసిన ప్రజ్ఞాన్ రోవర్.. నవ్వమ్మా నవ్వు..

చందమామపై చంద్రయాన్ 3 పరిశోధన కొనసాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై రోవ‌ర్ ప్రజ్ఞాన్ పరిశోధనలకు సంబంధించిన సమాచారంతో పాటు..చందమామ ఉపరితల ఫోటోలను ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపుతోంది. తాజాగా చంద్రయాన్ 3   రోవ‌ర్ ప్రజ్ఞాన్ మరికొన్ని ఫోటోలను పంపింది. 

 చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగిన విక్రమ్ ల్యాండ‌ర్ ఫోటోలను రోవ‌ర్ ప్రజ్ఞాన్ తీసింది.ఈ ఫోటోలను  రోవ‌ర్ ప్రజ్ఞాన్ ఇస్రోకు పంపింది.  రోవ‌ర్ ప్రజ్ఞాన్  తీసిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ఆగస్టు 30వ తేదీ ఉద‌యం  ఇస్రో త‌న ట్వీట్‌లో  పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

 రోవ‌ర్ ప్రజ్ఞాన్‌కు అమర్చిన నావిగేష‌న్ కెమెరా విక్రమ్ ల్యాండర్  ఫోటోలను తీసింది. ఈ ఫోటోలను షేర్ చేసిన ఇస్రో.. స్మైల్ ప్లీజ్ అని ట్వీట్‌లో కామెంట్ చేసింది. 

ALSO READ :తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. సెప్టెంబర్ ఒకటి నుంచి ఎల్లో అలర్ట్

 చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలంపైన అడుగు పెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రుడిపై సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్‌ ఉనికిని గుర్తించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్‌, క్రోమియం, టైటానియం, మాంగనీస్‌, సిలికాన్‌ ఉనికిని గుర్తించిందని..  హైడ్రోజన్‌ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.