తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతాయి, కానీ అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది. ఈ ఏడాది (2023) సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాల సమయంలో  తిరుమలకు భక్తుల రద్దీ  అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి  చెప్పారు. అన్నివిభాగాల అధికారులు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్స్ లేఖలు  స్వీకరించమని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని  తెలిపారు.   భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

 అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు  టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి  తెలిపారు. మొదట సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అదేవిధంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది (2023) శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించినట్లు చెప్పారు. 

ALSO READ :మనీలాండరింగ్ కేసులో మలయాళ నటి

వార్షిక బ్రహోత్సవాల షెడ్యూల్ వివరాలు..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి  వెల్లడించారు.

అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు 

నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 19వ తేదీన గరుడ వాహనం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. శ్రీవారి అన్నప్రసాదం, ఇంజినీరింగ్ పనులు, దర్శనం, కళ్యాణకట్ట, రవాణా, వసతి, పోలీసు, వైద్యం, ఆరోగ్యం, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. బ్రహ్మోత్సవాలతో పాటు పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.