
1. రాజు రవి అయినందువలన..
ఈ సంవత్సరంలో శత్రుత్వము అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య అగాదం ఉంటుంది. పరస్పరం ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొనగలరు. మేఘములు ఆకాశమునందు చక్కగా కనిపించగలవు కాని వర్షములు చాలా తక్కువగా ఉన్నవి. పరిపాలన సమయంలో రాజులకు ఏదైన ప్రమాదములు ఉండవచ్చును. దొంగలు విజృంభించగలరు. చోరత్వం, శత్రుత్వం చాలా ఎక్కువగా ఉన్నది. ప్రజలు పరస్పరం ఏదో ఒక చికాకు ఉంటుంది. అగ్నిప్రమాదములు అధికంగా ఉన్నవి. నక్సలైట్లు, తీవ్రవాదుల చేత పాలకులకు ఏదైనా అపాయం జరుగుటకు అవకాశములు ఉన్నవి. ప్రజాపాలకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము.
2. మంత్రి– చంద్రుడు అయినందు వలన..
మంచి వర్షములు. ప్రజలు ఆరోగ్యంగా ఉండుటకు చంద్రుని చల్లదనం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరు. పంటలు ముహూర్త బలంతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తే పంటలు బాగా పండును. గతములో కన్నా ప్రజలు సంతోషంగా ఉండగలరు. ప్రజాజీవనం సమతుల్యంగా ఉంటుంది.
3. సేనాపతి శని అయినందు వలన..
పాలకులు ప్రజలు పరస్పరం వైరీభావం కలిగి విమర్శలు చేసుకొనగలరు. పరస్పర వైరములు, సరిహద్దులో యుద్ధవాతావరణం కలిగి ఉంటుంది. పోలీస్ వారు చూసి చూడనట్లుగా ఉంటారు. పరిపాలన న్యాయ సమ్మతంగా ఉండదు. జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది. ధరలు అదుపులో ఉండవు. లంచగొండితనం పెరుగును. ప్రజలు పాప కర్మలు చేయగలరు. ఏదో ఒక విషయంలో అనవసరంగా వివాదములు సృష్టించుకొని కలహముల కాపురం చేయగలరు. శని మహర్దశ, శని అంతర్దశలో ఉన్నవారు నవగ్రహ ప్రదక్షిణలు, శనికి నువ్వులతో అభిషేకము తైలాభిషేకం నలుపు వస్త్రం దానం వలన ఉపశాంతి కలుగును. పాలకులు అధర్మంగా మాట్లాడగలరు.
4. ఆర్ఘాధిపతి రవి అయినందు వలన..
ధరలు నిలకడగా ఉండును. తక్కువగా వర్షములు కురియును. ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడగలరు. రాజులకు యుద్ధభయం కలిగి ఉంటారు. పరస్పరం స్నేహభావము లేక విమర్శలతో ఉండగలరు. ఆదివారం నియమనిష్టలు పాటించినవారికి కొంతవరకు ఉపశాంతి ఉంటుంది. నియమనిష్టలు లేనివారు, పాటించనివారు అనేక విధములుగా ఇబ్బంది పడగలరు. ప్రతినిత్యం సూర్య ధ్యానం, ఆరాధన చేయువారు సుఖంగా వర్ధిల్లగలరు.
5. మేఘాధిపతి రవి అయినందువలన..
పంటలు స్వల్పంగా పండగలవు. ఎరుపు ధాన్యములు దిగుబడి బాగా ఉంటుంది. ధరలు నిలకడగా ఉండగలవు. ప్రజలు భయము కలిగి ఉండగలరు. కారణం ఆదాయ వనరులు లేక ఆర్థిక బాధలు వ్యాపారులు ఇబ్బంది పడగలరు. అన్ని మతముల వారు కష్టకాలముగా ఈ సంవత్సరం గడపవలెను. సూర్య నమస్కారములు చేయువారికి అనుకున్నంత సమస్యలు ఉండవు. ప్రతి విషయంలో సూర్యాయనమః అనుకొనిన కొంత ఊరట కలిగి ఉండగలరు.
6. సస్యాధిపతి బుధుడు అయినందు వలన..
వర్షములు సామాన్యముగా కురియును. పంట దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. గాలితో కూడిన వర్షములు. పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షముల భీతి చెందుట జరుగును. ప్రజలు భీతి చెందగలరు. ఏమి అర్థం కాదు. జీవన విధానము అస్తవ్యస్తంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే నామము పారాయణం చేయువారికి విపత్తు అంత ఎక్కువగా ఉండదు.
7. రసాధిపతి శుక్రుడు అయినందువలన..
ధరలు నిలకడగా ఉండగలవు. మెట్ట పొలంలలో దుంప పంటలు అధికంగా దిగుబడి రాగలవు. బంగాలదుంప, కంద, బీట్రూట్, క్యారెట్, శనగకాయలు మొదలగు భూమిలోపలి పంటలు బాగా పండగలవు. చెరుకు, బెల్లం, పంచదార, కర్పూరము, కొన్ని రకాల సుగంధ ద్రవ్యములకు సంబంధించిన పంటలు లాభదాయకంగా ఉండగలవు.
8. నీరసాధిపతి బుధుడు అయినందువలన..
పచ్చ పెసలు పంట దిగుబడి బాగా వచ్చును. కొన్ని మెట్ట పంటలు లాభదాయకంగా పండగలవు. మరకతము, పచ్చలో అనేక విలువైన రత్నములు, మణులు మాణిక్యాలు, నవరత్నములు సమృద్ధిగా లభించగలవు. ధాన్యము ముహూర్తబలంతో సాగుచేసినవారికి అధిక దిగుబడిగా పంటలు పండును.
9. ధాన్యాధిపతి కుజుడు అయినందు వలన..
ఎరుపు ధాన్యములు బాగా పండగలవు. కందులు, నువ్వులు, గోధుమలు, పొట్టు కలిగినవి, శనగకాయలు, ఎరుపు భూమిలో పంటలు అధిక దిగుబడి కలిగి పంటలు పండగలవు. వర్షములు చాలా తక్కువగా కురియును. ధరలు నిలకడగా ఉండగలవు.
10. పశుపాలకుడు యముడు అయినందువలన ..
పశువులు పాలు తక్కువ ఇవ్వగలవు. పాలు ధరలు పెరుగును. పశు సంపదలకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గాడిదలు, కుక్కలు, నాలుగు కాళ్ల జంతువులకు వ్యాధులు అనేక విధములుగా రాగలవు. కుక్కలు మనుషులను బాగా కరుచుట జరుగును. యముని ఆధిపత్యం వలన అనేక విధములుగా వ్యాధులు వ్యాపించగలవు.
ఈ సంవత్సరము మతోన్మాదులు కాని, ఉగ్రవాదులు కాని, నక్సల్స్ వల్లకాని అరాచక సంఘటనలు జరిగే అవకాశమున్నది. నవగ్రహాలు వ్యతిరేక భావనల వలన వారిలో ఐక్యత లేక ప్రజలు తరచూ కలహించుకొనుట జరుగును. దేశారిష్టములు అనేక విధములుగా ఏదో ఒక ప్రాంతం గ్రహములు అనుకూలత లేక ఏదో ఒక విపత్తు జరుగుటకు అవకాశములు ఉన్నవి.
ప్రజలు ప్రభుత్వ పెద్దలు సమ్మతి, అసమ్మతి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ఏ కేటగిరి వారైన సరే అందరూ ఒకటిగా సామూహిక వాతావరణం కల్పించి పూజలు, యజ్ఞయాగములు, శివాభిషేకములు, సుదర్శన హోమమం, లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధనము చేయవలెను. రాజకీయ బలం తగ్గిపోవుచున్నది. ప్రజలకు హాని జరిగే దానికి అవకాశములు చాలా ఎక్కువగా ఉన్నవి. గ్రహ కూటమిలో చిక్కినప్పుడు ఏదో ఒక విపత్తు జరుగుటకు అవకాశాలు ఎక్కువగా ఉండగలవు. రాజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా నడుచుకోవలసిన సమయం ఆసన్నమైనది. ప్రజలు ప్రతిపక్షాలు, రాజకీయ అతిరథ మహారదులు, అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ విపత్తుల నుండి ప్రజలను కాపాడవలెను. గోప బాలకుని చేతిలో నెమలి పింఛము ఉండుట వలన అభివృద్ధి అనేది కనిపించదు.
ఈ సంవత్సరంలో గ్రహ కలయిక లేక అనేక విధములుగా విపత్తులు ఉన్నవి. అగ్ని భయము, విమాన, రైలు, బస్సు, కార్లు, బైక్ ప్రమాదులు అధికముగా ఉన్నవి. శకునం చూసి ఇంటి నుండి బయలుదేరవలయును. అధికముగా 3 గ్రహములు, 4 గ్రహములు, 5 గ్రహములు ఏకరాశి యందు కూటమిగా ప్రయాణం చేస్తున్నందు వలన కొన్ని విధములుగా విపత్తులు చవిచూడగలరు. వ్యాధులు పెరుగును. యుద్ధ భయము, తుపానులు, భూకంపములు, ప్రజా మరణములు శాస్త్రం తెలియ చేస్తున్నది. నివారణ ఎవరికి వారు గ్రామాల వారిగ, మండలముల వారిగా సమిష్టిగా నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, శివాభిషేకములు, మహన్యాస రుద్రాభిషేకములు, చండి, సుదర్శన, ఆయుస్సు హోమములు ఆచరించి ఈ విపత్తు నివారణ చేసుకొనుటకు అవకాశమున్నది.