- లీటర్ పెట్రోల్ కొట్టిస్తే.. 50 ఎంఎల్ దోపిడీ 8 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్,వెలుగు: కొందరు పెట్రోల్ బంకుల ఓనర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. మైక్రో చిప్స్‌తో కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఈ సీక్రెట్ చిప్ వల్ల మీటర్లో మనకు కరెక్ట్‌గానే పెట్రోల్ పోసినట్టు కనిపిస్తుంది. కానీ, లీటర్ పెట్రోల్ కొట్టిస్తే.. 30 ఎంఎల్ నుంచి 50 ఎంఎల్ వరకు ఓనర్లు గాయబ్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో పెట్రోల్ దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. గ్రేటర్ సహా రాష్ట్రంలో 34 బంకుల్లో చిప్స్ ఫిక్స్ చేసిన 8 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మైక్రో చిప్స్, మదర్ బోర్డ్స్, డిజిటల్ మీటర్స్, రిమోట్స్ సహా 64 రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోయినేడాది సెప్టెంబర్‌లో 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే దందా చేసి గతంలో జైలుకుపోయొచ్చి..!
పోలీసులు అరెస్టు చేసిన గ్యాంగ్‌లో మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ ఫైజల్ బారి(46), అల్వాల్‌కు చెందిన కురదె సందీప్(38), చంద్రయాణ్ గుట్ట బండ్లగూడకు చెందిన మహ్మద్ అస్లం(29) యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజు పల్లికి చెందిన నాగేశ్వరరావు(32), హకీంపేట్‌లోని టీఎస్‌ఆర్టీసీ ఫిల్లింగ్‌స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ వంద్యాల వంశీధర్‌రెడ్డి (30), మేడ్చల్ జిల్లా పూడులోని హరిహర ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ రంగు రమేశ్ (39), మైలార్‌దేవ్‌పల్లిలోని జీఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ సూపర్‌వైజర్ బీరవెల్లి మహేశ్వర్ రావు(49), గగన్‌పహాడ్‌లోని మౌలా సర్వీస్ స్టేషన్ ఓనర్ నాగండ్ల వెంకటేశ్(28) ఉన్నారు. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు సోదాలు చేస్తున్నారు. మైక్రో చిప్ బంకుల యజమానులను గుర్తిస్తామని బాలానగర్ డీసీపీ పద్మజ చెప్పారు. నిందితుల్లో మహ్మద్ ఫైజల్ బారి, కురదె సందీప్, మహ్మద్ అస్లం, నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంక్‌ల్లో పనిచేశారు. వీళ్లు ఫిల్లింగ్ బాక్స్‌లో ట్యాంపరింగ్‌పై టెక్నిక్ నేర్చుకున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన జయేష్ వద్ద మైక్రో చిప్స్ కొనుగోలు చేసి.. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలోని బంకుల్లో ఇన్‌స్టాల్ చేసేవారు. ఒక్కో చిప్ ఇన్‌స్టాలేషన్ కోసం వీళ్లు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బంకు యజమానుల దగ్గర వసూలు చేసేవారు. ఈ క్రమంలో 2014లో కూకట్‌పల్లి పోలీసులకు చిక్కారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లీ చిప్స్ ఇన్‌స్టాలేషన్ ప్రారంభించారు. మీడియేటర్స్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, సిద్దిపేటతో పాటు ఏపీ, కర్నాటకలో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఫిక్స్ చేశారు.
ట్యాంపరింగ్ ఇట్లా..!
పెట్రోల్ పిల్లింగ్ బాక్స్ మీటర్ బోర్డ్ వెనుక భాగంలోని మదర్‌బోర్ట్‌లో మైక్రో చిప్‌ను ఫిక్స్ చేస్తారు. దీనికి డిస్ప్లే బోర్డ్‌లోని డిజిటల్ నంబర్స్ రీడింగ్‌కు కనెక్ట్ చేస్తారు. కరెక్ట్ రీడింగ్ చూపిస్తూ తక్కువ పెట్రోల్ డెలివరీ అయ్యే విధంగా ఈ మైక్రో చిప్ వర్క్ చేస్తుంది. ప్రతి బంకులో సుమారు నాలుగు ఫిల్లింగ్ మిషన్లుంటే.. రెండు ఫిల్లింగ్ మిషన్లను ఇట్ల ట్యాంపర్ చేస్తారు.