మనం గొప్పగా ఎదిగితే అందరికంటే ఎక్కువ సంతోషించేంది అమ్మానాన్నలే. నా బిడ్డ ఇది సాధించాడంటూ పది మందికీ చెప్పుకొని పొంగిపోతారు. కానీ ఉన్నత స్థానానికి చేరిన బిడ్డలు.. తల్లిదండ్రులను తమ వెంట వచ్చి సుఖాలను అనుభవించాలని కోరినా అందుకు సిద్ధంగా ఉండే వాళ్లు మాత్రం చాలా తక్కువే. తాము బతికిన ఊరు, నమ్ముకున్న వృత్తిని వదిలి వచ్చేందుకు అమ్మానాన్నలు ఇష్టపడరు. పచ్చటి పల్లెలో ఉండే ప్రశాంత జీవితాన్ని వదిలేసి.. సిటీల్లోకి వచ్చి ఆ లైఫ్ స్టైల్‌ను అలవాటు చేసుకోవాలని కోరుకోరు. ఎవరో తప్ప ఎక్కువ మంది తమ పనులు చేసుకుంటూ జీవితం చివరి దశ వరకూ అలా గడిపేయాలని కోరుకుంటారు. కానీ రాజకీయ కుటుంబాల్లో ఈ పరిస్థితి కొంత మేర భిన్నంగా ఉంటుంది. పొలిటికల్‌గా ఎదిగిన వాళ్ల కుటుంబాల్లో అతి కొద్ది మంది మాత్రమే సాదాసీదా జీవనాన్ని కొనసాగించడం మనం చూస్తుంటాం. ఇలాంటి లైఫ్ స్టైల్‌నే గడుపుతున్నారు తమిళనాడులో ఓ జంట. తమ కొడుకును ఏకంగా కేంద్ర మంత్రి పదవి వరించినా కూడా.. ఆయన తల్లిదండ్రులు మాత్రం తమ ఊరిలో రైతు కూలీలుగానే ఉంటున్నారు. బిడ్డ రాజకీయంగా గొప్ప పదవిలోకి పోయాడని బడాయి ప్రదర్శించడం లేదు. ఇటీవలే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా బీజేపీ నేత ఎల్ మురుగన్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చినా.. ఆయన తల్లిదండ్రులు మాత్రం ఇండిపెండెంట్‌గా బతికేందుకే ఇష్టపడుతున్నారు. సొంతూరిలోనే ఉంటూ పొలం పనులు చేసుకుంటూ.. రైతు కూలీలుగానే బతుకుతున్నారు.
మీడియాలో స్టోరీ.. మెచ్చుకుంటూ ప్రతిపక్ష ఎంపీ ట్వీట్
తమిళనాడులో సాధారణ కుటుంబానికి చెందిన ఎల్ మురుగన్ రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆయన కష్టాన్ని, ప్రతిభను గుర్తించి ప్రధాని మోడీ కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అంతకు ముందు తమిళనాడులోనే బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి రావడంతో ఢిల్లీకి షిఫ్ట్ అవ్వక తప్పనిసరి. అయినా ఆయన తల్లిదండ్రులు వరుదమ్మాళ్, లోకనాథన్ మాత్రం తమిళనాడులోని తమ సొంతూరు కోనూర్‌లోనే ఉంటున్నారు. చిన్న ఇంటిలో నివసిస్తూ.. తమ బతుకు బండి నడిపించడానికి రైతు కూలీలుగానే ఉంటున్నారు. మురుగన్‌కు మంత్రి పదవి వచ్చిందని తెలిసి చాలా సంతోషించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అప్పులు చేసి తమ కొడుకును చదివించామని, ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదగడం ఎంతో ఆనందిస్తున్నామని చెబుతున్నారు. తమకు ఊరిపై మమకారంతో ఇక్కడి నుంచి ఎటూ వెళ్లడం ఇష్టం లేదని అన్నారు. కొడుకుకి కేంద్ర మంత్రి పదవి వచ్చినా కూడా లోకనాథం అందరితో కలిసి ఎప్పటిలానే ఉంటున్నాడని ఊరిలో జనం కూడా చెబుతున్నారు. చెన్నైలో అంబేద్కర్ లా కాలేజీలో మురుగన్ లా పూర్తి చేసుకుని కొన్నాళ్లు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో యాక్టివ్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. క్రమంగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థాయికి వచ్చారు. మురుగన్ కుటుంబానికి సంబంధించిన ఈ కథనం జాతీయ పత్రికల్లో రావడంతో దానిని ప్రతిపక్ష శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘హృదయాన్ని హత్తుకునే స్టోరీ, కొడుకు ఎల్ మురుగన్ కేంద్ర మంత్రి అయినా సరే ఆయన తల్లిదండ్రులు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. హ్యాట్సాఫ్” అంటూ ఆమె పోస్ట్ చేశారు.