- అమెరికాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది.
- మంగళవారం లక్షన్నర కేసులు నమోదయ్యాయి.
- దీంతో ఆంక్షలను తిరిగి అమలు చేసేందుకు
- అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వాషింగ్టన్: అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్ విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయినా, మూడు నాలుగు రోజులుగా రోజూ 70 వేల నుంచి లక్ష దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాటికి కేసుల సంఖ్య లక్షన్నరకు చేరింది. 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 1,49,788 మందికి కరోనా సోకింది. వైరస్‌తో 516 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.53 కోట్లకు, మొత్తం మృతుల సంఖ్య 6.14 లక్షలకు చేరుకుంది. మరోవైపు, ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంగళవారం ఒక్కరోజే 11,515 మంది కరోనా పేషెంట్లు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గతంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నపుడు ఈ స్థాయిలో పేషెంట్లు అడ్మిట్ అయ్యారని అధికారులు చెప్పారు. కరోనా కేసులు తగ్గడంతో గతంలో సడలించిన ఆంక్షలను తిరిగి అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కరోనాపై విజయం సాధించామని జులై 4 న ప్రెసిడెంట్జో బైడెన్ ప్రకటించారు. అయితే, పరిస్థితి మళ్లీ అదుపుతప్పుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం వణికిపోతోంది.