చిన్న పిల్లోడు.. పదేళ్ల వయస్సు.. ఎంతో చెలాకీగా ఉంటాడు.. మూడో తరగతి చదువుతున్నాడు.. ఈ వయస్సులో ఏం తిన్నా అరాయించుకునే శక్తి ఉంటుంది.. ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు.. అలవాటు అయ్యే వయస్సు కూడా కాదు.. బయట తిండ్లు తినే వయస్సు కాదు.. బయటకు తిరిగే వయస్సు అంతకన్నా కాదు.. టెన్షన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియని వయస్సు.. బరువు బాధ్యతలు అంటే ఏంటో కూడా తెలియదు.. ఒత్తిడి ఎలా ఉంటుందో కూడా తెలియని వయస్సు.. ఇంత చిన్న వయస్సులో.. గుండెపోటుతో చనిపోవటం అంటే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగిత్యాల జిల్లా దరూర్ గ్రామంలో జరిగిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో బాలే హర్షిత్ అనే మూడవ తరగతి చదువుతున్న బాలుడికి గుండెపోటు వచ్చింది. తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్ధకు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దరూర్ కు చెందిన హరిత- గంగాధర్ దంపతుల రెండవ కుమారుడు హర్షిత్. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.