- రామగుండం రైల్వే స్టేషన్ లో ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఘటన
గోదావరిఖని, వెలుగు : రైలు ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో రామగుండం రైల్వే స్టేషన్లో ట్రైన్లోనే 108 సిబ్బంది డెలివరీ చేశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన సోమ ప్రవీణ్కుమార్ఆగ్రాలో ప్రైవేటు జాబ్చేస్తున్నాడు. ఆయన భార్య స్వాతికి ఎనిమిది నెలలు నిండడంతో ఇంటికి తీసుకొస్తున్నాడు. ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా బుధవారం సాయంత్రం మందమర్రికి రైలు రాగానే ఒక్కసారిగా స్వాతికి పురుటి నొప్పులు మొదలయ్యాయి.
టీసీ వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేయగా గోదావరిఖని 108 ఈఎంటీ అబ్దుల్చాంద్, పైలట్ఎస్.రవి రైలు రామగుండం రైల్వే స్టేషన్ కు చేరారు. రైలులోనే స్వాతికి డెలివరీ చేశారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు రైలును స్టేషన్లో నిలిపివేశారు. స్వాతికి మగ శిశువు జన్మించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. చికిత్స నిమిత్తం గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎమర్జెన్సీ టైమ్ లో స్పందించి రైలులో డెలివరీ చేసిన 108 సిబ్బందిని ప్రయాణికులు
అభినందించారు.