
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో శుక్రవారం 11 మున్సిపాల్టీల కమిషనర్లు పర్యటించారు. పురపాలక శాఖ సంచాలకులు టీకే శ్రీదేవి ఆదేశాలతో యాదగిరి గుట్ట, మోత్కూరు, జనగామ, ఆలేర్, భువనగిరి, రామాయంపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువుల తయారీ, డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛ బడిని పరిశీలించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారీ విధానాన్ని వివరించారు.
ప్లాస్టిక్ తో తయారైన ఇటుక, టైల్స్, స్వచ్ఛ బడిలో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో సంపదను సృష్టించడం, ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం, వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృతులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగుచేయడం వంటి అంశాలను గమనించారు. హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని సందర్శించి పొడి చెత్తను కంప్రెషర్ మిషన్ ద్వారా ముద్దగా తయారుచేసి విక్రయానికి తరలించే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ప్లాస్టిక్ ని అరికట్టడానికి వార్డు స్థాయిలో స్టీల్ బ్యాంక్ లను పరిశీలించారు.