కౌమార దశ కూడా దాటని చిన్నారి.. లోకజ్ఞానం కూడా తెలియని పసిపాప.. మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన ఘటన దేశ ప్రజలందరిని దిగ్ర్భాంతికి గురి చేసింది. తీవ్ర గాయాలతో దాదాపు వారంపైనే పోరాడి చివరికి కన్ను మూసింది. అంతర్గతంగా అయిన గాయాల కారణంగా.. అంతచిన్న వయసులో రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం హృదయ విదారక ఘటనగా మారింది.
గుజరాత్ బరుచ్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. తల్లిదండ్రులు కంపెనీలకు పనికి పోవడంతో.. పసితనంతో ఆడుకుంటున్న చిన్నారిని పొదల్లోకి ఎత్తుకెళ్లి రేప్ చేశాడు ఓ 30 ఏళ్ల కిరాతకుడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన డిసెంబర్ 16న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన తర్వాత అంక్లేశ్వర్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత వడోదరలోని ఎస్ఎస్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చికిత్స అందిస్తున్న తరుణంలో వారానికిపైగా మృత్యువుతో పోరాడి అలాంటి కిరాతకులు ఉన్న లోకంలో ఉండలేను అని కనుమూసింది చిన్నారి. చిన్నారి హెల్త్ కండిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎస్ఎస్ జీ డాక్టర్ల బృందం చిన్నారి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ప్రకటించారు. చిన్నారికి మధ్యాహ్నం 2 గంటలకు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని, వెంటనే ట్రీట్ మెంట్ అందించడంతో కొంత కుదుట పడినట్లు అనిపించిందని తెలిపారు. ఆ తర్వాత 5 గంటల 15 నిమిషాలకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృత్యువుతో పోరాడి కనుమూసింది. కార్డియాక్ అరెస్టు అయిన వెంటనే ట్రీట్ మెంట్ మొదలు పెట్టినా లాభం లేకుండా పోయిందని డాక్టర్ హితేంద్ర చౌహాన్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి వారి గుడిసె ముందు ఆడుకుంటుండగా.. అదే ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే కార్మికుడు ఎత్తుకెళ్లాడు. సమీపంలో ఉన్న పొదలకు ఎత్తుకెళ్లి రేప్ చేయడమే కాకుండా.. వెళ్లే ముందు ఆ పాపను తీవ్రంగా గాయపరిచి వెళ్లాడు. మనుషులలో రాక్షసులు ఉంటారనడానికి ఇతడి ప్రవర్తనే ఉదాహరణగా చెప్పవచ్చు. రేప్ జరిగిన ఒక రోజులోనే ఆ దుర్మార్గున్ని పట్టుకున్నారు పోలీసులు. జార్ఖండ్ కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. అయితే రేప్‌కు గురైన చిన్నారిది కూడా జార్ఖండే కావడం గమనార్హం.
గుజరాత్, జార్ఖండ్ ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడ:
వలస కార్మికులను గుజరాత్ ప్రభుత్వం చూస్తున్న తీరుపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. బాధిత కుటుంబాన్ని జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండె పరామర్శించారు. ఆ కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వలస కార్మికుల సంక్షేమానికి, రక్షణకు గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, చాలా చులకనగా చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ సున్నితమైన కేసును రాజకీయం చేయాలని చూస్తోందని గుజరాత్ ఆరోగ్య మంత్రి, బీజేపీ నేత రిషికేష్ పటేల్ విమర్శించారు.