లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి

లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి
  • కర్నాటకలో ఘోర ప్రమాదం
  • మరో ఘటనలో నలుగురు ఏపీ విద్యార్థులు దుర్మరణం

రాయ్​చూర్: ఉత్తర కర్నాటకలోని ఎల్లాపూర్, రాయచూర్ జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. ఈ యాక్సిడెంట్లలో 24 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎల్లాపురలో జరుగుతున్న జాతరలో పండ్లు అమ్ముకునేందుకు హవేరి జిల్లా సావనూరుకు చెందిన 29 మంది చిరువ్యాపారులు లారీలో బుధవారం తెల్లవారుజామున బయల్దేరారు. ఉదయం 5.30 గంటల  సయమంలో వీళ్లు ప్రయాణిస్తున్న లారీ 50 మీటర్ల లోతు లోయలో పడిపోయింది.

దీంతో స్పాట్​లోనే 8 మంది చనిపోయారు. సమాచారం అందగానే పోలీసులు స్పాట్​కు చేరుకుని డెడ్​బాడీలను, గాయాలైనవాళ్లను హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న మరో వెహికల్​కు దారి ఇచ్చే క్రమంలో లారీ లోయలో పడిపోయిందని చెప్పారు.

పల్టీ కొట్టిన వెహికల్.. ఏపీ విద్యార్థులు మృతి

రాయచూరు జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులతో సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. వేద పాఠశాల విద్యార్థులు మంగళవారం రాత్రి కర్నాటకలోని హంపి టూర్​కు బయల్దేరారు.

 నరహరి తీర్థుల ఆరాధనకు వెళ్తుండగా సింధనూరు దగ్గరలోని అరగినమర క్యాంపు వద్ద వీళ్ల వెహికల్ టైర్ పంచరై, పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ శివ(24)తో పాటు విద్యార్థులు అభిలాశ్(20), సుశీంద్ర(22), ఆర్యవందన్(18) అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన మిగతా స్టూడెంట్లను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ప్రధాని మోదీ సంతాపం

ఎల్లాపూర్ జిల్లాలో 10 మంది మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవాల్లకు రూ.50 వేల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్​షా, కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. రాయచూర్ జిల్లాలో స్టూడెంట్ల మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.