![ఫ్రీ జర్నీలో రికార్డ్ : 15 కోట్ల జీరో టికెట్స్ కొట్టిన ఆర్టీసీ](https://static.v6velugu.com/uploads/2024/02/1521-cr-women-utilise-free-travel-in-tsrtc-buses_y8fu6nok2K.jpg)
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహలక్ష్మీ పథకం గురించి తెలిసిందే. ఈ పథకంలోని ఓ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఏర్పడ్డ అతి కొద్ది రోజులకే గ్యారెంటీల్లో రెండు అమలు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం బస్సు ఆక్యుపెన్సీని గణనీయంగా పెంచిందని, టీఎస్ఆర్టీసీ రోజువారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9, 2023 నుంచి ఫిబ్రవరి 6, 2024 మధ్య 15. 21 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించారని టీఎస్ఆర్టీసీ నివేదిక విడుదల చేసింది. ఈ పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా మహిళలు దాదాపు రూ.535 కోట్లు ఆదా చేశారని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ పథకం కింద మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా వారు ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దూర పరిమితి లేకుండా రాష్ట్రంలోని నలుమూల ఈ పథకాన్ని వర్తింపగేశారు.