చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్ .. అగ్రనేత జగదీశ్​​ సహా 17 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్ .. అగ్రనేత జగదీశ్​​ సహా 17 మంది మావోయిస్టులు మృతి
  • మృతుల్లో 11 మంది మహిళలే.. భారీగా ఆయుధాలు స్వాధీనం
  • సుక్మా జిల్లా కెర్లపాల్​ ఏరియాలో ఘటన.. పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్​
  • నలుగురు జవాన్లకూ గాయాలు
  • ఈ ఏడాది 3 నెలల్లోనే 143 మంది మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​ లో మరో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. సుక్మా జిల్లాలోని కెర్లపాల్​ ఏరియాలో   శనివారం చోటుచేసుకున్న  ఎదురుకాల్పుల్లో  మావోయిస్టు అగ్రనేత, దర్బా డివిజన్​ ఇన్ చార్జి జగదీశ్​ అలియాస్​ బుద్రూ సహా 17 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. నలుగురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ముగ్గురు డీఆర్జీ, సీఆర్​పీఎఫ్​కు చెందిన ఒక జవాన్​ గాయపడిన వారిలో ఉన్నారు. 

వీరిని చికిత్స కోసం సుక్మా జిల్లా కేంద్రానికి తరలించారు. డీఐజీ కమలోచన్​ కశ్యప్​ పర్యవేక్షణలో సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ ఆధ్వర్యంలో డీఆర్జీ, సీఆర్​పీఎఫ్​ జవాన్లు 500 మంది జిల్లా పరిధిలోని కేర్లపాల్​ పోలీస్​ స్టేషన్​ గోగుండా కొండపై- ఉపంపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్​ నిర్వహించారు. మావోయిస్టుల  ప్లీనరీని చుట్టుముట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా 17  మంది మావోయిస్టులు మృతిచెందారు.  

పక్కా సమాచారంతో..

భద్రతా బలగాలపై టీసీఓసీ ( టాక్టికల్​ కౌంటర్​ అఫెన్సివ్​ క్యాంపెయిన్​ )లో భాగంగా అటాక్​ చేసేందుకు మావోయిస్టులు సిద్ధపడుతుండగా.. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మావోయిస్టుల వ్యూహాన్ని భగ్నం చేసేందుకు డీఐజీ కమలోచన్​ కశ్యప్​ డీఆర్జీ, సీఆర్​పీఎఫ్​ జవాన్లను రంగంలోకి దించారు. పెద్ద ఎత్తున బలగాలు శుక్రవారం రాత్రి నుంచే దండకారణ్యంలోకి ప్రవేశించి.. మావోయిస్టుల వేట ప్రారంభించాయి. 

ఉపంపల్లి గుట్టలను నలువైపులా ఆధీనంలోకి తీసుకుని మావోయిస్టుల ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత మావోయిస్టు పార్టీ గార్డులు అప్రమత్తమై బలగాలపై కాల్పులకు దిగారు. డీఆర్జీ, సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రతిదాడులకు దిగగా ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో 17 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్​ ముగిశాక 10 కిలోమీటర్ల మేర మృతదేహాలను జవాన్లు మోసుకొచ్చారు. భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.   

 మావోయిస్టుల మాస్టర్​మైండ్​ జగదీశ్ ​మృతి

 దర్బా డివిజన్ ఇన్​చార్జి, స్పెషల్ జోనల్​ కమిటీ సభ్యుడు, బస్తర్​ ప్రాంతంలో దాడుల వ్యూహకర్త జగదీశ్​​ అలియాస్​ బుద్రూ ఎన్​కౌంటర్​లో చనిపోయారు. 2013లో జీరంఘాట్​లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ లీడర్​ మహేంద్రఖర్మపై దాడి చేసి హతమార్చిన ఘటనలో జగదీశ్​ను కీలక సూత్రధారిగా చత్తీస్​గఢ్​ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ దాడిలో మొత్తం 27 మంది కాంగ్రెస్ లీడర్లు చనిపోయారు. 2023లో అరన్​ఫూర్​ అడవుల్లో డీఆర్జీ జవాన్లపై దాడి చేశారు. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. సుక్మా జిల్లాలోని కుకునార్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పిట్టేడబ్బా గ్రామానికి చెందిన జగదీశ్​ చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరారు. దండకారణ్యంపై మంచి పట్టు ఉన్న అగ్రనేత మృతితో బలగాలకు పోలీసు ఉన్నతాధికారులు స్వీట్లు తినిపించి, అభినందించారు. 

ఈ ఏడాది ఇప్పటికే 143 మంది మృతి

  •     2025 లో ఇప్పటి వరకు వరుస ఎన్​కౌంటర్లలో 143 మంది మావోయిస్టులు మృతి చెందారు. 
  •     జనవరి 4న అబూజ్​మడ్​ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక మహిళ సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. డీఆర్జీ జవాను కూడా మృతి చెందారు. 
  •     జనవరి 6న ఐఈడీ పేల్చి 9 మంది డీఆర్జీ జవాన్లను మావోయిస్టులు చంపేశారు.
  •     జనవరి 9న సుక్మా–- బీజాపూర్​ బార్డర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
  •     జనవరి 12న బీజాపూర్​ మద్దేడు ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు. 
  •     జనవరి 16న చత్తీస్​గఢ్–​-తెలంగాణ బార్డర్​లో పూజారి కాంకేర్​ ఎన్​కౌంటర్​లో  18 మంది మావోయిస్టులు చనిపోయారు. 
  •     జనవరి20–-21 మధ్య చత్తీస్​గఢ్–​-ఒడిశా బార్డర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
  •     ఫిబ్రవరి 2న బీజాపూర్​ జిల్లా గంగులూరు వద్ద జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
  •     ఫిబ్రవరి 9న బీజాపూర్​ జిల్లా మద్దేడు-–ఫర్సేగఢ్​ బార్డర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు.  
  •     మార్చి 20న దంతెవాడ–-బీజాపూర్​ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది, అదే రోజు కాంకేర్​ జిల్లాలో లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 
  •     తాజా ఎన్​కౌంటర్​(మార్చి 29) 17 మంది మావోయిస్టులు మృతిచెందారు.

హింసతో ఏం సాధించలేం: అమిత్​షా

ఆయుధాలు, హింసతో ఏమీ సాధించలేమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా అన్నారు. సుక్మా ఎన్​కౌంటర్​లో 17 మంది మావోయిస్టులు మృతిచెందడంపై అమిత్​షా సోషల్​ మీడియా వేదికగా స్పందించారు.  మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, శాంతి ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. భద్రతా బలగాల సాహసాన్ని ఆయన అభినందించారు. కాగా, ఈ నెల​ 4న అమిత్​ షా బస్తర్​లోని దంతెవాడ జిల్లాలో పర్యటించనున్నారు. 

‘ఆపరేషన్​ కగార్’​ పై సమీక్ష, ఎన్​కౌంటర్లలో పాల్గొన్న జవాన్లతో భేటీ ఈ పర్యటనలో కీలకం. నక్సల్స్ వాదాన్ని ఖతం చేసే క్రమంలో సుక్మా ఎన్​కౌంటర్​ ఒక ముందడుగు అని చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​సాయ్​ అన్నారు. చత్తీస్​గఢ్​ హోం  మంత్రి విజయ్​శర్మ మాట్లాడుతూ.. సరెండర్​ పాలసీ చక్కగా ఉందని, మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు.