- బాధ్యతలు చేపట్టగానే అక్రమ ఇమిగ్రెంట్లను వెనక్కి పంపుతానన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ గా వచ్చే నెల 20న బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను వెనక్కి పంపే పని మొదలు పెడతానని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) అధికారులు అక్రమ వలసదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాలో మొత్తం 15 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లు ఉన్నారు. వారిలో 18 వేల మంది ఇండియన్లు ఉన్నారు. దీంతో తమకు డిపోర్టేషన్ ముప్పు తప్పదని ఆ ఇండియన్లు ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి డేటాను ఐసీఈ అధికారులు గత నెలలో విడుదల చేశారు. మొత్తం 15 లక్షల మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని, వారిలో ఇండియన్లు 17,940 మంది ఉన్నారని తెలిపారు. వాస్తవానికి 7.25 లక్షల మంది ఇండియన్లు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత మూడో స్థానం భారత్ దే అని వెల్లడించారు. కాగా.. అక్టోబరు 22న కొంతమంది అక్రమ వలసదారులను చార్టర్డ్ ఫ్లైట్ లో ఇండియాకు వెనక్కి పంపారు. దీంతో సరైన డాక్యుమెంట్లు లేని ఇండియన్లు తమ స్టేటస్ ను చట్టబద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.