- పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే చాన్స్
- కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు (జీపీ) ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి, పాతవాటితో పాటే ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. కొత్త జీపీల్లో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనే ఉన్నాయని సమాచారం. కాగా.. ఆయా జిల్లాల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీ రాజ్ శాఖకు అంతకుముందు వినతులు వెల్లువెత్తాయి. కొత్త జీపీలపై ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, ఎలాగైనా ఏర్పాటుచేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అందరి నుంచి ప్రపోజల్స్ తీసుకున్న పంచాయతీ రాజ్‌శాఖ.. జనాభా, దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలను తిరస్కరించి, ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించింది.తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలను తిరస్కరించి, ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించింది.
పాత జీపీలతోపాటే ఎన్నికలు
కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రభుత్వం కొత్త జీపీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. కాగా, రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత జీపీలతో పాటు కొత్తగా ఏర్పాటు అవుతున్న మరో 200 జీపీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పంచాయతీల్లో వార్డులు, ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా 200 పంచాయతీలను ఏర్పాటు చేస్తే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జీపీల సంఖ్య 13,191 కు చేరుకుంటుంది.
ALSO READ :365 బీ నేషనల్హైవే అలైన్మెంట్ మార్పు ఉన్నట్టా లేనట్టా?
350 కనీస జనాభా నిబంధనతో సమస్యలు
ఏజెన్సీ గ్రామాల్లో పలు గ్రామాలు పంచాయతీలకు దూరంగా ఉండడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయి. అభివృద్ధి విషయంలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని గూడాలు, తండాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన అభ్యర్థుల ముందు ఇదే డిమాండ్ పెట్టారు. తాము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ నిలుపుకునే అవకాశం రావడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ఎన్నికలకు ముందే పంచాయతీలను ఏర్పాటు చేస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కాగా.. గూడేలు, తండాలు, అనుబంధ గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటుచేస్తే దూరభారం తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్రం నుంచి ప్రత్యేక ఫండ్స్ రావడం వల్ల అభివృద్ధి చెందే అవకాశముంది. అయితే.. 350 జనాభా నిబంధన పలువురికి అడ్డంకిగా మారింది. తాము పెట్టిన ప్రపోజల్స్‌లో ఏ ఒక్క గ్రామాన్ని కూడా తొలగించవద్దని, అవసరమైతే 350 కనీస జనాభా నిబంధనను మార్చయినా అన్నింటికీ ఓకే చెప్పాలని ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.