ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఖలీద్ సన్హౌరీ ఆకలితో అలమటిస్తూ మరణించిన విషాద ఘటన.. నాలుగు నెలల అంతర్యుద్ధం వల్ల సూడాన్ దేశంలో ఏర్పడిన ఆహార సంక్షోభాన్ని, పౌర ప్రపంచం తక్షణం స్పందించాల్సిన ఆవశ్యకతను తెలుపుతున్నది. బాంబు పేలుళ్లు, కాల్పుల మోత వల్ల తాను ఆహార పదార్థాల కొనుగోలు కోసం బయటకు వెళ్లలేక ఆకలితో మరణిస్తున్నట్టు ఆయన పెట్టిన పోస్ట్ సూడాన్ లో ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది.
ఏప్రిల్15న ఆ దేశ రాజధాని సహా దేశవ్యాప్తంగా పలు సుడానిస్ ఆర్ముడ్ ఫోర్సెస్ సైనిక స్థావరాలపై మహమ్మద్ హమ్దాన్ డగాలో నాయకత్వంలోని పారా మిలిటరీ దళాలు రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) దళాలు దాడి చేయడంతో మొదలైన అంతర్యుద్ధం నాలుగు నెలలు కొనసాగి, 5వ నెలలోకి ప్రవేశించింది. 100 రోజుల ఈ సంక్షోభంలో ఇప్పటివరకు 3900 మంది మరణించడంతోపాటు 6000 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 3.3 మిలియన్ల మంది సుడాన్వాసులు ప్రాణ రక్షణ కోసం చాద్ ,ఈజిప్ట్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇథియోపియా, లిబియా, సౌత్ సూడాన్ తదితర పొరుగు దేశాలకు శరణార్థులుగా వలసబాటపట్టారు.
తీవ్ర ఆహార కొరత
అమెరికా, సౌదీ అరేబియాల మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ కోసం జెద్దాలో జరిగిన చర్చలను, ఒప్పందాలను ఆల్ బుర్హన్ నాయకత్వంలోని సైన్యం కానీ, డగాలో నాయకత్వంలోని ఆర్ఎస్ఎఫ్ దళాలు గానీ గౌరవించడం లేదు. ఫలితంగా అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరు సైనిక నియంతల అధికార దాహం వల్ల నెత్తుటేరులు పారుతున్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికాలో మూడో అతిపెద్ద దేశంగా మన దేశ విస్తీర్ణంలో దాదాపు సగం వైశాల్యం ఉన్న సూడాన్ 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి15 సార్లు సైనిక పాలన వచ్చినా, ప్రస్తుతం ఇద్దరు రాకాసి నియంతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టడమే గాక ప్రపంచ దేశాలను సైతం ఆందోళనకు గురి చేసింది.
బ్లూనైలు, వైట్ నైలు నదుల అపార జలవనరులు, చమురు నిల్వలు, బంగారం లాంటి అపార ఖనిజ సంపద కలిగి ఉండి, ‘హబుబు’ లాంటి ఇసుక తుఫానులను సైతం ధైర్యంగా ఎదుర్కొనే సూడాన్వాసులు బుల్లెట్ల మోతలు కంటే ఆహార కొరత వల్ల మరణిస్తున్న పరిస్థితి ఎక్కువైందని యూఎన్వో హెచ్చరిస్తోంది. 120 రోజులుగా చర్చల్లో పురోగతిలేక కాల్పుల విరమణ పాటించడం లేదు. ఫలితంగా ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయి సరఫరా గొలుసు తెగిపోయింది. ఆహారం, మంచినీరు, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. కార్మికులకు, ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్ప కూలింది. తిండి లేక ప్రజలు శరణార్థి శిబిరాలకు తరలిపోతున్నారు.
శాంతి నెలకొల్పాలి..
గత నాలుగు నెలలుగా ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా ఎఫ్ఏవో 1.4 మిలియన్ల మందికి ఆహారం అందించింది. తక్షణమే 25 మిలియన్ల మందికి ఆహార ధాన్యాలు,13.6 మిలియన్ల మంది పిల్లలకు మానవతా సాయం అందించాలని ఎఫ్ఏవో ప్రపంచ దేశాలను కోరింది. ఐదు కోట్ల మంది సూడాన్ వాసులను రక్షించేందుకు ఆదేశంపై ఆసక్తి ప్రదర్శిస్తున్న విదేశీ శక్తులు, యూఎన్ వో,ఈయూ, ఆఫ్రికన్ యూనియన్ లాంటి సంస్థలు శాంతిస్థాపనకు ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించాలి.
తక్షణం కాల్పుల విరమణ పాటించేలా ఒప్పించి ఉద్రిక్తతలను తగ్గించాలి. అధికారం కోసం 2019లో కుదిరిన ‘మిలిటరీ, పౌర భాగస్వామ్యంతో ప్రభుత్వం’ ఒప్పందాన్ని, నిరుడు డిసెంబర్ 5న కుదిరిన ఒప్పందాలను ఇరువర్గాలు గౌరవించేలా ఒప్పించాలి. రష్యా, చైనా, అమెరికాలు ఎర్ర సముద్రంలో సైనిక స్థావరాలు ఏర్పాటుపై పెడుతున్న శ్రద్ధలో కొంతైనా సూడాన్ శాంతి స్థాపనపై పెట్టాలి. సూడాన్ సాయుధ గ్రూపులకు ఆయుధాలు విక్రయిస్తున్న చైనాను కట్టడి చేయాలి. యూఎన్వో ఆధ్వర్యంలో చర్చలు జరిపి సూడాన్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలి.
- తండ ప్రభాకర్ గౌడ్, సోషల్ ఎనలిస్ట్