దరఖాస్తుల వెల్లువ .. ముగిసిన గ్రామ, వార్డు సభలు

దరఖాస్తుల వెల్లువ .. ముగిసిన గ్రామ, వార్డు సభలు
  • ఉమ్మడి జిల్లాలో నాలుగు పథకాలకు కొత్తగా 2.53 లక్షల అప్లికేషన్లు
  • అత్యధికంగా రేషన్ కార్డులకు 1.41 లక్షలు
  • జాబితాలో పేర్లు లేనివారికి మరో అవకాశం 
  • రేపటి నుంచి నాలుగు పథకాలకు శ్రీకారం

ఆదిలాబాద్, మంచిర్యాల వెలుగు :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ల లిస్ట్​లను గ్రామసభల్లో ప్రదర్శించారు. అయితే గతంలో దరఖాస్తులు చేసుకున్నా అర్హులైన కొంతమంది పేర్లు రాకపోవడంతో చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అర్హులైన వారందరికీ పథకాలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా జాబితా రూపొందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాలు అమలు చేయనుండగా అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేశారు. 

రేషన్ కార్డులకు అధికం

రాష్ట్రంలో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న  రేషన్ కార్డులు అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. ఏండ్ల తరబడి రేషన్ కార్డుల్లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వారికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతంలో దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి జాబితా విడుదల చేశారు. దీంతో కొంత మంది అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోవడం.. గవర్నమెంట్ ఉద్యోగులు, కార్డు ఉన్న వారి పేర్లే మళ్లీ రావడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి అర్హులైన వారి నుంచి రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో అప్లికేషన్లు తీసుకునేందుకు అవకాశం కల్పించింది.

ALSO READ : నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు

 దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు జరిగిన సభల్లో రేషన్ కార్డుల కోసమే భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,41,176 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాత స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 68,398 అప్లికేషన్లు వచ్చాయి. అటు రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చేపట్టిన సర్వేలో సాగుకు యోగ్యంగా లేని వేల ఎకరాల భూములను గుర్తించారు. ఇక నుంచి ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారు. 

    జిల్లా                       రేషన్ కార్డులు      ఇందిరమ్మ ఇండ్లు    రైతు భరోసా    ఆత్మీయ భరోసా

ఆదిలాబాద్                    41,080                       22,309                  387                          13,666    

మంచిర్యాల                   35,824                      18,637                   2028                        8,532

నిర్మల్                            39,982                      15,962                   11,347                     1211

ఆసిఫాబాద్                    24,290                      11,490                    6,403                        651 

మొత్తం                          1,41,176                    68,398                   20,165                      24,060