- టీజీపీఎస్సీ చైర్మన్ సహా పలు రాష్ట్రాల చైర్మన్లు హాజరు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్లతో 26వ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం బెంగుళూరులో 25వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్లతో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంతో పాటు ఇతర రాష్ట్రాల కమిషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి చీఫ్ గెస్టుగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ హాజరై, ప్రారంభించారు.
ఇందులో రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న పద్ధతులపై చర్చించారు. ఎగ్జామ్స్‌ను పారదర్శకంగా నిర్వహించడం, ఫలితాలు వేగవంతంగా రిలీజ్ చేయడం తదితర అంశాలపైనా డిస్కస్ చేశారు. ఈ సమావేశంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రీతి సుదాన్ తదితరులు పాల్గొన్నారు.