నైజీరియాలో స్కూల్ నుంచి..287 మంది పిల్లల కిడ్నాప్

  •  సాయుధ మూకల దాడిలో ఒకరి మృతి

న్యూఢిల్లీ :  నైజీరియాలోని ఓ స్కూల్​పై సాయుధ మూకలు  దాడి చేసి 287 మంది విద్యార్థులను కిడ్నాప్​ చేశాయి. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కడునా రాష్ట్రం కురిగా స్కూల్లో ఈ ఘటన జరిగింది. నైజీరియాలో ఇలాంటివి సాధారణమే అయినా, ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేయడం కలకలం రేపుతున్నది. సాయుధ మూకలు శుక్రవారం స్కూల్​ను చుట్టుముట్టి గాల్లోకి కాల్పులు ప్రారంభించగానే విద్యార్థులు, సిబ్బంది తప్పించుకునేందుకు ప్రయత్నించారని స్కూల్​ టీచర్​ సానీ అబ్దుల్లాహి తెలిపారు. 

అనంతరం వారు పిల్లలను కిడ్నాప్​చేసినట్టు చెప్పారు. ఎంతమంది వారి చెరలో ఉన్నది లెక్కతేలలేదని అన్నారు. కాగా, విద్యార్థులంతా 8–15 ఏండ్ల వయస్సులోపువారని, వారిని రక్షించేందుకు సాయుధ బలగాలు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టినట్టు కడునా గవర్నర్​ ఉబా సానీ తెలిపారు. ఏ ఒక్క చిన్నారికి కూడా హానీ కలగకుండా చూసే బాధ్యత తమదేనని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.