కాంగ్రెస్లో జులై 2వ తేదీపై లొల్లి.. భట్టి వర్గం వర్సెస్ పొంగులేటి వర్గం..

కాంగ్రెస్ పార్టీలో జులై2వ తేదీపై లొల్లి మొదలైంది. ఈ తేదీపై భట్టి విక్రమార్క వర్గం, కాంగ్రెస్ లో చేరబోతున్న పొంగులేటి వర్గం మధ్య వివాదం చెలరేగింది.  ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే రోజు..అంటే జులై 2వ తేదీనే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఖమ్మం వైఎస్సార్ నగర్ లో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జులై 2వ తేదీనే సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర కూడా ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సభను ఘనంగా నిర్వహించాలని భట్టి వర్గం భావిస్తోంది. ఇందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం వైస్సార్ నగర్ లో నిర్వహించే సభ పొంగులేటి జాయినింగ్ సభనా..లేక భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభనా అనే కన్ఫ్యూజన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో నెలకొంది.

భట్టిని కలిసిన ఠాక్రే..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసింది. ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గం మోతె మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో  పాదయాత్ర శిబిరం దగ్గర  భట్టి విక్రమార్కను రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కలిశారు. భట్టి పాదయాత్ర ముగింపు సందర్బంగా జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లపై భట్టితో మాణిక్ రావు ఠాక్రే చర్చించారు. అనంతరం భట్టి విక్రమార్కను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి సన్మానించారు. 

ఖమ్మంలోకి పాదయాత్ర..

భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోకి ఎంట్రీ అయింది. 105వ రోజు కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలం మామిల్లగూడెంలో ముగించుకుని ఖమ్మం జిల్లాలోకి చేరుకున్నారు. ప్రస్తుతం భట్టి పాదయాత్ర ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కొనసాగుతుంది.