
- రూ. 30 వేలు తీసుకొని దొరికిన అశ్వాపురం ఏవో
- రూ. 3 వేలు తీసుకుంటూ పట్టుబడిన మంథని సర్వేయర్
- హైదరాబాద్‌లో రూ. లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం
మణుగూరు, వెలుగు : పత్తి కొనుగోలుకు సంబంధించి టీఆర్ (ట్రాన్స్‌పోర్ట్ రిసిప్ట్) ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అగ్రికల్చర్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... అశ్వాపురం మండలానికి చెందిన ఓ రైతు పత్తికి సంబంధించిన టీఆర్ కోసం ఇటీవల ఏవో సాయి సంతన్‌కుమార్‌ను కలిశాడు. టీఆర్ ఇచ్చేందుకు ఆ ఆఫీసర్ రూ. 30 వేలు డిమాండ్ చేశారు.
దీంతో సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం అశ్వాపురం అగ్రికల్చర్ ఆఫీస్‌కు వెళ్లి ఏవో సాయి సంతన్‌కుమార్‌కు డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏవోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏవోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో ఇన్స్‌పెక్టర్లు శేఖర్, సట్ల రాజు పాల్గొన్నారు.
మంథనిలో సర్వేయర్...
మంథని, వెలుగు : రైతు వద్ద లంచం తీసుకున్న ఓ సర్వేయర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా మంథని మండలం రెవెన్యూ పరిధిలోని రెడ్డి చెరువు వద్ద సర్వే నంబర్ 814 /డి /1, 815/సిలో ఉన్న ఎకరం భూమిని సర్వే చేయాలని రైతు సువర్ణ క్రాంతి సర్వేయర్ జాటోతు గణేశ్‌ను కలిశాడు. సర్వే చేసేందుకు రూ. 17 వేలు డిమాండ్ చేయగా రైతు ఈ నెల 5న రూ. 9 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు.
వారి సూచన మేరకు గురువారం రూ. 3 వేలు ఇచ్చేందుకు సర్వేయర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో బస్టాండ్ వద్దకు రావాలని సర్వేయర్ చెప్పడంతో రైతు అక్కడికి వెళ్లి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సర్వేయర్ గణేశ్‌ను పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు తిరుపతి కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డులు అశోక్, సంతోష్ పాల్గొన్నారు.
హైదరాబాద్ లో...మెహిదీపట్నం,
వెలుగు : బిల్ ప్రాసెస్ చేసేందుకు రూ. లక్ష లంచం తీసుకున్న ఓ ఆఫీసర్‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... బొప్పరి ఆనంద్ కుమార్ మాసబ్‌ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎంగా పనిచేస్తున్నారు. ఓ వ్యక్తికి సంబంధించి రూ. 33.32 లక్షల బిల్ ప్రాసెస్ చేసేందుకు రూ. 1.33 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి సిటీ రేంజ్ 2 యూనిట్ ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఆనంద్‌కుమార్‌కు రూ. లక్ష ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆనంద్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.