- ఎస్ఎంఎస్ల ద్వారా సమన్లు జారీ.. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కంప్లైంట్
- ఎక్కడున్నా జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం
- క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి
- బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు ఫుల్స్టాప్
న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్యా అధినియం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది.
ఈ కొత్త చట్టాలతో దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమన్లు పంపడం, క్రూరమైన నేరాలకు సంబంధించి వీడియోగ్రఫి తప్పనిసరి వంటి నిబంధనలు కొత్త చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయని చెప్తున్నది. రాజ్యాంగంలో పొందుపర్చిన ఐడియాలజీలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత సామాజిక వాస్తవాలను, నేరాలను పరిష్కరించేందుకు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మెకానిజాన్ని ఈ చట్టాలు అందిస్తాయని హోంశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.
పేర్లు మార్చి.. పలు సంస్కరణలు చేశాం: అమిత్ షా
బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరగడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కేంద్రం తెచ్చిన 3 కొత్త చట్టాలతో న్యాయం దొరుకుతుందని తెలిపారు. ప్రజల కోసం.. పార్లమెంట్ వీటికి రూపకల్పన చేసిందన్నారు. వలసవాద నేర సామాజిక చట్టాల ముగింపును సూచిస్తాయని తెలిపారు. చట్టాల పేర్లు మాత్రమే మార్చలేదని, వాటిలో ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పారు. జస్టిస్ అనేది అంబ్రెల్లా టర్మ్ అని, ఇది.. బాధితుడు, దోషిని ఇద్దరినీ కలుపుతుందని తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత
భారతీయ న్యాయ సంహిత చట్టంలో 358 విభాగాలున్నాయి. దేశంలోని కొత్త క్రిమినల్ కోడ్. దీనిలో 511 సెక్షన్లు ఉన్నాయి. 163 ఏండ్ల పాత ఐపీసీని ఈ కొత్త చట్టం భర్తీ చేయనుంది. అత్యాచారం, ఆర్గనైజేషనల్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ వంటివి పరిష్కరించేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం.