ఏ తిండి తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది..? ఇమ్యునిటీ పవర్ను పెంచే ఫుడ్స్ ఇవే..

ఏ తిండి తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది..? ఇమ్యునిటీ పవర్ను పెంచే ఫుడ్స్ ఇవే..

మొన్నటి వరకు చలి వణికించేసింది.. అనుకున్నాం. ఇప్పుడేమో ఎండలు మండిపోతున్నాయి. చిత్రమేంటంటే ఈసారి.. ఫిబ్రవరిలోనే టెంపరేచర్​ బాగా పెరిగింది. అయితే సీజన్ మారినప్పుడల్లా కొందరిలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి కనిపిస్తుంటాయి. వాటినుంచి తప్పించుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి. అలా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మామూలుగానే కాలంతోపాటు ఆహారంలో మార్పులు వస్తాయి. అయితే ఏ సీజన్​లో అయినా తినే ఫుడ్​లో ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) పెంపొందించేవి ఉండాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఎందుకంటే.. ఆహారమే ఆరోగ్యం. అన్ని రకాల నూట్రియెంట్స్​ బాడీకి అందినప్పుడే హెల్దీగా ఉంటాం. అందులో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్​ తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అనారోగ్యాన్ని తిప్పికొట్టే ఆయుధం కూడా ఇమ్యూనిటీనే. కాబట్టి ఏ తిండి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందనేదానిపై అవగాహన ఉండాలి. ఇంతకీ ఇమ్యూనిటీ పవర్​ను పెంచే ఆ ఫుడ్స్​​ ఏంటి? 

ఇమ్యూనిటీ అనేది యాంటీ ఆక్సిడెంట్ రెసిస్టెంట్​లా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్​ బాగా పనిచేయాలంటే ముందుగా జీర్ణశక్తి బాగుండాలి. తర్వాత ఎక్సర్​సైజ్ చేయాలి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి ఏవైనా దాడి చేసినప్పుడు రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడుతుంది. అయితే కొన్నిసార్లు వైరస్​లు బలంగా మారుతుంటాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ శక్తికి మించి వాటితో పోరాడుతుంది. అలా మన శరీరానికి రక్షణ కవచంలా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అయినాసరే ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతుంటుంది. తద్వారా శక్తిలేకపోవడం, నీరసించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలే ఇమ్యూనిటీ తగ్గిందని తెలిపే సంకేతాలని గుర్తించాలి. గాయాలైనప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ వెంటనే గుర్తించి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. దాంతో గాయం త్వరగా నయమవుతుంది. అంటువ్యాధులు కూడా అంతే. అదే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. 

పండ్లు.. కూరగాయలు

పండ్లు, కూరగాయలు మన ఇమ్యూనిటీని కాపాడతాయి. మెరుగుపరుస్తాయి. వాటిలో విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్​లో దొరికే మామిడి, బొప్పాయి, ఆరెంజ్ వంటి పసుపు, ఆరెంజ్​ రంగులో ఉండే ఫ్రూట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. వెజిటబుల్స్​లో కూడా అంతే. క్యారెట్స్, గుమ్మడి కాయ, దోసకాయ వంటివి. వీటిలో కెరటిన్, విటమిన్, ఎ, సి, ఇ, కెతోపాటు మైక్రో మినరల్స్​ ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా విటమిన్​ – సి ఉండే ఫుడ్స్​ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్​ల నుంచి కాపాడుతుంది.  

ప్రొటీన్ల కోసం.. 

మనం తినే ఆహారంలో ప్రొటీన్లు సరిపడా ఉండాలి. అందుకోసం గుడ్లు, చేపలు, చికెన్, పనీర్, బొబ్బర్లు, రాజ్మా వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 ఉంటాయి. ప్రొటీన్​ తక్కువ ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అలాగే.. రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు వంటివి తీసుకోవాలి. వీటిలో జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి కూడా ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి సాయపడతాయి. ఇకపోతే నట్స్​లో.. బాదం, గుమ్మడి గింజలు వంటివి కూడా తీసుకోవాలి. 

ఒత్తిడి వల్ల ఇమ్యూనిటీకి ఎఫెక్ట్

ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి ఇమ్యూనిటీ మీద నేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్​ లెవల్స్ పెరుగుతాయి. దాంతో వ్యాధి కారకాల మీద పోరాడే శక్తిని ఇమ్యూనిటీ వ్యవస్థ కోల్పోతుంది. అలాగే ఒత్తిడి బాడీలో ఇన్​ఫ్లమేషన్​కు కారణమవుతుంది. అది కూడా ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. జీర్ణకోశంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే.. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి వల్ల నిద్ర సరిగా ఉండదు. దానివల్ల అలసటగా ఉంటారు. సోషల్ యాక్టివిటీస్​లో పార్టిసిపేట్ చేయలేరు. 

దీనంతటికీ కారణం ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడడమే. ఇలాంటప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా మంచి ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్​​సైజ్​లు చేయాలి. స్ట్రెస్​ని తగ్గించుకునేందుకు కామెడీ షోలు చూడడం, సాంగ్స్ వినడం, డాన్స్ చేయడం వంటివి చేయొచ్చు. అలాగే ఒత్తిడి వల్ల నిద్రలో మార్పులు వస్తాయి. స్ట్రెస్​ వల్ల కొందరు ఎక్కువగా నిద్రపోతుంటారు. రాత్రుళ్లు పొట్ట నిండుగా తినడం, మద్యం తాగడం వల్ల పొద్దున లేవగానే అలసటగా అనిపిస్తుంది. అదే టైంకి తక్కువ ఫుడ్ తీసుకుని పడుకుంటే మార్నింగ్ లేవగానే యాక్టివ్​గా ఉంటారు. డైజేషన్ సరిగా ఉంటే ఆటోమెటిక్​గా ఇమ్యూనిటీ మెరుగవుతుంది. 

పసుపు.. నిమ్మరసం..

వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు వంటివి ఇమ్యూనిటీ తగ్గకుండా చూస్తాయి. వీటిని యాంటీ ఇన్​ఫ్లమేటరీ అంటారు. అంటే బాడీలో ఇన్​ఫ్లమేషన్ రాకుండా కాపాడతాయి. సమ్మర్​లో టీ, కాఫీలు తగ్గించి నిమ్మరసం, చియా, సబ్జా గింజల నీళ్లు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్​గా ఉంటుంది. అది కూడా ఇమ్యూనిటీకి మేలు చేస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండాలంటే ఫైబర్, ప్రొటీన్ ఉండే ఫుడ్​ తీసుకోవాలి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉండే ప్రొబయోటిక్స్, పులియబెట్టిన ఆహారం వంటివి తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడడమే కాదు.. ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. 

ఇమ్యూనిటీ బూస్టర్స్ 

 ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి రికవరీ స్టేజ్​లో ఉన్న పేషెంట్లకు డాక్టర్ల సూచనమేరకు అందజేస్తారు. ఉదాహరణకు వైరల్ ఫీవర్ వచ్చినవాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. వాళ్లకు విటమిన్ సి, డి, ప్రొబయోటిక్ ఫుడ్ ఇవ్వాలి.

శుభ్రత ముఖ్యం

రోగనిరోధక వ్యవస్థ తినే తిండిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్, కొవ్వులు, చక్కెర, ఉప్పు, నూనె, మసాలా, ఐస్​క్రీమ్​లు వంటివి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే శుభ్రంగా లేని నీళ్లు లేదా పానీయాలు తాగడం, బయట కట్​ చేసి పెట్టిన పండ్ల ముక్కలు, సలాడ్​లు తినడం మంచిది కాదు. కొంతమందికి వెంటనే రియాక్షన్​ చూపిస్తుంది.

మరికొందరికి నెమ్మదిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అది ఇమ్యూనిటీ తగ్గడం వల్లే జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 

జలుబు చేస్తే.. 

ఒక పరిశోధన ప్రకారం.. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా జలుబు బారిన పడతారు. పెద్దలకు ఏటా రెండు నుంచి మూడు సార్లు జలుబు చేస్తుంది. అది వారం లేదా పదిరోజుల్లో తగ్గిపోతుంది. తగ్గకపోతే మాత్రం ఇమ్యూనిటీ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. పొగ తాగేవాళ్లకు ఇమ్యూనిటీ సిస్టమ్​ నేరుగా ఎఫెక్ట్ అవుతుంది. శ్వాసకోశంలో ఇబ్బందులు కలిగిస్తుంది. 

జలుబు చేసినప్పుడు చాలామంది విటమిన్ – సి ఫుడ్​ తినకూడదని చెప్తుంటారు. అది అపోహ. ఆ టైంలో విటమిన్​ సి ఉండే ఫ్రూట్స్, ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో త్వరగా నయమయ్యేలా చేస్తుంది. అలాగని ఫ్రిజ్​లో పెట్టిన వాటిని, చల్లటి జ్యూస్​లను తీసుకోకూడదు. 

– డా. సుజాత స్టీఫెన్ 
చీఫ్​ నూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్ హైదరాబాద్