సాగర్ ప్రాజెక్ట్ మిగులు భూములు 300 ఎకరాలు రికవరీ!

సాగర్ ప్రాజెక్ట్ మిగులు భూములు 300 ఎకరాలు  రికవరీ!
  • ప్రాజెక్ట్ మిగులు భూములపై ఆఫీసర్ల ఫోకస్
  • పోలేపల్లిలో రైతుల సాగులోని 300 ఎకరాలు స్వాధీనం 
  • పట్టాలను క్యాన్సిల్ చేయించి, హద్దురాళ్లు ఏర్పాటు 
  • మరో ఐదు గ్రామాల్లో 700 ఎకరాలు ఉన్నట్టు గుర్తింపు
  • ఆ భూములనూ స్వాధీనం చేసుకునేందుకు అధికారుల చర్యలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ​ప్రాజెక్టు మిగులు భూములు 300 ఎకరాలను అధికారులు రికవరీ చేశారు. గత 20, 30 ఏండ్ల నుంచి రైతుల ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూములను వెనక్కి తీసుకున్నారు.  ఖమ్మం రూరల్​ మండలం పోలేపల్లిలో దాదాపు 300 ఎకరాల ఎన్​ఎస్పీ భూమి ఉంది. అందులో కొన్ని సర్వే నంబర్లు ధరణిలో ఎక్కాయి.  మరికొన్ని ఆన్​ లైన్​ రికార్డుల్లో నమోదు కాలేదు. దీంతో ఇన్నేండ్లుగా అధికారులెవరూ ఆ భూములను పట్టించుకోలేదు. 

ఆ పక్కన పట్టా భూములన్న  రైతులు వాటిని తమ భూముల్లో కలుపుకొని సాగు చేసుకుంటున్నారు. ఇలా 80 ఎకరాల వరకు సాగులో ఉండగా, 20 ఎకరాల దాకా కొందరు రైతులు పట్టా చేయించుకున్నారు. వాటిని వేరొకరికి అమ్మేశారు. ఇటీవల మిగులు భూముల విషయాలను గుర్తించిన ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులు పాత రికార్డులను తిరగేశారు.

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1969లో అవార్డు జారీ చేసిన పేపర్లను సంపాదించారు. వాటి ప్రకారం భూముల పట్టాలను క్యాన్సిల్ చేయించి రైతుల నుంచి వెనక్కి తీసుకున్నారు. వాటి చుట్టూ పటిష్టంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న భూముల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మిగులు భూములను గుర్తించారిలా..!

మున్నేరు నది వరద కాలనీల్లోకి రాకుండా నివారించేందుకు రెండు వైపులా రూ.690 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. దీనికి అవసరమైన చోట్ల భూసేకరణ కోసం పాలేరు నియోజకవర్గ స్పెషలాఫీసర్​ రమేశ్, ఇరిగేషన్​ డిపార్ట్ మెంట్ ఈఈ బానాల రమేశ్ రెడ్డి, రూరల్​ తహసీల్దార్​రాంప్రసాద్​ కసరత్తు చేస్తుండగా, మిగులు భూముల వ్యవహారం బయటపడింది. పోలేపల్లి రెవెన్యూ పరిధిలో మున్నేరు పక్కనున్న సర్వే నంబర్లు కొన్ని ధరణిలో ఎన్ఎస్పీ భూములుగా చూపిస్తుండడంతో మొత్తం ఎన్ని ఎకరాలు ఉందో గుర్తించేందుకు 1969లో భూసేకరణ కోసం జారీ చేసిన అవార్డును సంపాదించారు. 

ఆ అవార్డును ఆన్​లైన్​లో ఇంప్లిమెంట్ చేయకపోవడంతో అందులోని చాలా సర్వే నంబర్లు ధరణిలో కనిపించడం లేదు. వెంటనే అవార్డును ఆన్ లైన్ చేయడంతో పాటు భూముల రికవరీ ప్రక్రియ చేపట్టారు. 300 ఎకరాలను స్వాధీనం చేసుకొని, ఇప్పటి వరకు 278 ఎకరాల చుట్టూ 117 హద్దు రాళ్లు పాతారు.  వాటిని తొలగించకుండా పటిష్టంగా ఉండేందుకు ఒకటిన్నర టన్నుల బరువుతో కాంక్రీట్ దిమ్మెలను చేయించి వాటిని జేసీబీలతో పాతే పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రికవరీ చేసిన ఎన్ఎస్పీ భూముల్లో వెంచర్​కు అనువైన వాటిని గుర్తించి, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇండ్లను, భూములను కోల్పోతున్న బాధితులకు ప్లాట్లుగా చేసి ఇవ్వాలని ఆఫీసర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

మరో ఐదు గ్రామాల్లో 700 ఎకరాలు

ఒక్క పోలేపల్లిలోనే కాదు, ఖమ్మం రూరల్​ మండలంలోని మరో ఐదు గ్రామాల్లో కూడా పెద్ద మొత్తంలో ఎన్ఎస్పీ మిగులు భూములను ఆఫీసర్లు గుర్తించారు. ముత్తగూడెం, తెల్దారుపల్లి, మదులపల్లి, రామన్నపేట, దానవాయిగూడెం గ్రామాల పరిధిలో 600 నుంచి 700  ఎకరాల వరకు ఎన్ఎస్పీ ల్యాండ్ ఉందని రికార్డుల్లో గుర్తించారు. అప్పటి అవార్డుల ఆధారంగా సర్వే నంబర్లను నిర్ధారించారు. ప్రస్తుతం వాటిని రికవరీ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. 

ఇన్నేండ్లుగా అటు ఎన్ఎస్పీ, ఇటు రెవెన్యూ అధికారులు రికార్డుల్లోని ప్రాజెక్టు భూముల గురించి పట్టించుకోకపోవడంతో జిల్లాలో మిగులు భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. ఖమ్మం సిటీతో పాటు కల్లూరు, వైరాలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఫంక్షన్​ హాళ్లు, వ్యాపార సంస్థలు, ఇండ్ల స్థలాలు, ప్రైవేట్ పట్టా భూములుగా మారాయి. వాటన్నింటినీ రికవరీ చేస్తే, ప్రభుత్వానికి రూ. వందల కోట్ల విలువైన భూములు దక్కే చాన్స్ ఉంది.