
బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు పట్టణంలో గత నాలుగు రోజులగా విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి దాదాపుగా 300 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటుగా పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిని భద్రత మధ్య తిరుపతికి తరలించారు.
ప్రొద్దుటూరులో కొంతమంది నగల వ్యాపారులు ఇన్‌వాయిస్‌లు లేకుండానే వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు.
అయితే దీనికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రముఖ షాపుల్లో ఐటీ సోదాలు జరగడంతో పండుగ సీజన్‌లో నగల విక్రయాలపై ప్రభావం పడింది. ప్రొద్దుటూరులో 1000కు పైగా నగల దుకాణాలు ఉన్నాయి. ఈ పట్టణాన్ని 'సెకండ్ బొంబాయి' లేదా 'బంగారు పట్టణం' అని పిలుస్తారు.