న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 394 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 జులై 19 నాటికి దేశంలోని 21 రాష్ట్రాల్లో 4,130 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
కేరళ, తమిళనాడులో ఒక్క టీచర్ పోస్టు కూడా ఖాళీగా లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 5,639 కేజీబీవీలు మంజూరైతే.. 2024 మార్చి 31 నాటికి 5,116 కేజీబీవీలు పని చేస్తున్నాయని, ఇందులో 7.07 లక్షల మంది అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. ఇంకా 523 కేజీబీవీలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.