వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ

వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ

నకిరేకల్, వెలుగు : పట్టణంలోని ఎమ్మెల్యే  వేముల వీరేశం నూతన స్వగృహంలో గురుస్వామి సి.వెంకటేశ్వరశర్మ నేతృత్వంలో సోమవారం అయ్యప్పస్వామి 3వ మహాపడి పూజోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ నుంచి వందలాది మంది అయ్యప్ప స్వాములు తరలివచ్చారు. అయ్యప్ప కీర్తనలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తిపారవశ్యంలో మునిగిపోయాయి. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్పస్వామి ఎక్కడో ఉండరని, మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని తెలిపారు. అయ్యప్ప దీక్ష చాలా గొప్పదని, కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మాల ధరిస్తారని చెప్పారు. ప్రతిఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు  ఎమ్మెల్యే దంపతులు అల్పాహార అన్నదాన ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, సినీ నటుడు ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.