- అలా ఆడేవారిని ప్రోత్సహిస్తాం
- టీమిండియా హెడ్ కోచ్ గంభీర్
- రేపటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్
బెంగళూరు: టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ ఫలితాన్ని రాబట్టాలనే ఆలోచనతో ఉన్న తమ బ్యాటర్లను ఆపేది లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మున్ముందు వంద రన్స్‌కే ఆలౌటైన రోజులు ఎదురైనా తమ ప్లేయర్లు హై రిస్క్ క్రికెట్ ఆడేందుకు తాను అండగా నిలుస్తానని చెప్పాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రోహిత్‌సేన టీ20 స్టయిల్లో బ్యాటింగ్ చేసి ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం నుంచి జరిగే న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు సోమవారం మీడియాతో మాట్లాడిన గంభీర్.. కివీస్‌పైనా తమ జట్టు పంథా మారదన్నాడు. ‘సహజమైన ఆటను ఆడాలనుకునే క్రికెటర్లను ప్రోత్సహిస్తాం. అయినా ఒక్క రోజులో 400-–500 రన్స్ చేసే వాళ్లను ఎందుకు ఆపాలి? ఎక్కువ రిస్క్ తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం వస్తుంది. ఒక్కోసారి ప్రతికూల ఫలితం కూడా రావొచ్చు. అయినా సరే మేం ఇదే పంథాను కొనసాగిస్తాం. మున్ముందు మా జట్టు 100 రన్స్‌కే ఆలౌటయ్యే రోజులు వస్తే అప్పుడు చూసుకుంటాం. కానీ, హై రిస్క్ క్రికెట్ ఆడేలా మా ప్లేయర్లకు సపోర్ట్ ఇస్తాం. ఆ విధంగానే ఆడుతూ ఏ పరిస్థితిలోనైనా ఫలితాలను పొందాలనుకుంటున్నాం’ అని స్పష్టం చేశాడు.
టెస్టు క్రికెట్ అంటే అదే
పరిస్థితులకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకోవడం ఇండియాకు చాలా ముఖ్యమని గౌతీ చెప్పాడు. ‘మనం ఒక రోజులో 400 రన్స్ చేయగలిగిన జట్టుగా ఉండాలని, అలాగే డ్రా కోసం రెండు రోజులు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నామని నేను ఇదివరకే చెప్పా. దీన్నే వృద్ధి, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అంటారు. టెస్టు క్రికెట్ అంటే ఇదే. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లు జట్టులో చాలా మంది ఉన్నారు. కాబట్టి మా మొదటి ఉద్దేశం ఎప్పుడూ మ్యాచ్ నెగ్గడమే. డ్రా అనేది తర్వాతి ఆప్షన్. మేం ఇతర రకాల క్రికెట్ ఆడాలని కోరుకోవడం లేదు. ప్లేయర్లు గ్రౌండ్‌లోకి వెళ్లి తమ సహజమైన ఆట ఆడాలని కోరుకుంటున్నాం’ అని గౌతీ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆట పూర్తి భిన్నంగా ఉంటుందున్న గంభీర్ ఆ టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టగలదన్నాడు. ఈ సిరీస్ తమకు సవాల్‌తో కూడుకున్నదని చెప్పాడు. ఇక, టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని గంభీర్ తెలిపాడు. తను వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని కొనియాడాడు. చాన్నాళ్లుగా అద్భుతంగా రాణించినా కోహ్లీ ఇప్పటికీ పరుగుల దాహంతో ఉన్నాడన్నాడు. ప్రతీ మ్యాచ్ తర్వాత అతడిపై ఓ నిర్ణయానికి రాకూడదని గౌతమ్ అభిప్రాయపడ్డాడు.
జోరుగా ప్రాక్టీస్
తొలి టెస్టు కోసం ఇండియా, న్యూజిలాండ్ జట్లు సోమవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. కెప్టెన్ రోహిత్, విరాట్, అశ్విన్‌తో పాటు బంగ్లాతో టీ20లకు దూరంగా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్ తదితరులు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ చెమటోడ్చారు. రోహిత్‌తో కలిసి పిచ్‌ను పరిశీలించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. మరోవైపు కివీస్ ప్లేయర్లు కూడా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.