- కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ అక్ అదాలత్ కు కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒక్క రోజులోనే 11,55,993 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,42,253, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 6,13,740 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.161.05 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోను లోక్ అదాలత్ నిర్వహించారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి కూడా కేసుల పరిష్కార వివరాలను తెలియజేశారు. రాష్ట్రంలో 337 లోక్ అదాలత్ బెంచ్ ద్వారా కేసుల పరిష్కారం జరిగిందన్నారు.
హైకోర్టులో225 కేసుల పరిష్కారం
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. శ్రీదేవి పాల్గొన్నారు. హైకోర్టులో 225 కేసులు పరిష్కారం అయ్యాయి., వీటిలో 35 ప్రీ లిటిగేషన్ , 190 పెండింగ్ కేసులున్నాయి. రూ.15.93 కోట్లను 1,100 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.