![‘కనుపాప’ లకు కష్టమొచ్చింది.. సర్కారు బడుల్లో విద్యార్థులకు దృష్టి లోపం](https://static.v6velugu.com/uploads/2025/02/5-of-govt-school-students-in-kamareddy-district-suffer-from-vision-problems_X65EqDQV7x.jpg)
- సర్కారు బడుల్లో విద్యార్థులకు దృష్టి లోపం
- వందమందిలో ఐదుగురికి సమస్య
- కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 69,017 మందికి కంటి పరీక్ష
- 3,580 మందికి చూపు సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
- సెల్ఫోన్లు, టీవీల ప్రభావమే కారణం
కామారెడ్డి, వెలుగు : సర్కారు బడుల్లో విద్యార్థులు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కండ్లు మసకబారడం, నీరుకారడం, దగ్గర, దూరపు చూపు సమస్యలతో బాధపడుతున్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడుల్లో కంటి పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్బీఎస్కే, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి టెస్టులు చేశారు. వంద మంది విద్యార్థుల్లో ఐదుగురికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 69,017 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, 3,580 మందికి దృష్టి లోపం, 154 మంది ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఖాళీ టైంలో ఆటలు ఆడుకోకుండా అధిక శాతం విద్యార్థులు సెల్‌ఫోన్, టీవీ చూడటంతోనే దృష్టి లోపం వస్తున్నదని, పోషకాహార లోపం కూడా ఓ కారణమని డాక్టర్లు చెప్తున్నారు. స్టూడెంట్స్‌కు మరోసారి టెస్టులు చేసి అద్దాలను అందజేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంటున్నది.
కొనసాగుతున్న రెండో విడత టెస్టులు..
జిల్లాలో 182 హైస్కూల్స్, 129 రెసిడెన్షియల్స్, కస్తూర్బా స్కూళ్లలో కొద్ది నెలల క్రితం కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించారు. మెల్లె కన్ను, నీరు కారడం, కన్ను ఎర్రగా మారటం వంటి ఇబ్బందులు ఉండగా, వీరికి అద్దాలు అందజేయాల్సి ఉన్నది. సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుండడంతో ఫస్ట్ విడత టెస్టుల్లో వచ్చిన పాయింట్ ఇప్పుడు పెరిగే అవకాశం ఉన్నది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండో విడత టెస్టులు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో 2,094 మందికి, బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో 1,486 మందికి కంటి పరీక్షలు చేశారు. ఆర్బీఎస్కేకు ఉన్న వెహికిల్స్‌లో స్టూడెంట్స్‌ను దవాఖానకు తీసుకొస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు 200 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ నెల17 నుంచి షురూ అయిన ఐ టెస్టులు మార్చి ఫస్ట్ వీక్‌లో ముగియనున్నాయి. కంటి పరీక్షలు పూర్తైన తర్వాత దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు అద్దాలను అందజేయనున్నారు.
15 రోజుల్లో అద్దాలు ఇస్తాం..
కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులకు టెస్టులు నిర్వహిస్తున్నాం. ఫస్ట్ విడతలో టెస్టులు చేసినవారికి సెకండ్ విడతలోనూ కంటి పరీక్షలు చేస్తాం. దృష్టి లోపం ఉన్న విద్యార్థులందరికీ 15 రోజుల్లోగా కంటి అద్దాలను అందజేస్తాం. - చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో