వర్షం బీభత్సం.. 52 గ్రామాలు జలదిగ్బంధం

వర్షం బీభత్సం..   52  గ్రామాలు జలదిగ్బంధం
  • జలదిగ్బంధంలో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, బోయినిపల్లి 

నెట్‌వర్క్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పొంగిపొర్లింది. ఊరు, ఏరు తేడా లేకుండా ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే కనిపించింది. మోయతుమ్మెద వాగుతోపాటు చెరువుల మత్తళ్లతో ఏర్పడిన చిన్నవాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 52  గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటీవల రైతులు వేసిన వరి నాట్లు, మొలకలు వచ్చిన పత్తి చేన్లు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. 

వరదముంపులో ఊళ్లు, కాలనీలు

కరీంనగర్‌‌:  కరీంనగర్ సిటీలోని ముకరంపురలోని పరివార్ బేకరీ వెనకాల ప్రాంతం, కిసాన్ నగర్, జ్యోతినగర్ ఏరియాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఎన్టీఆర్ స్టాచ్యూ, కలెక్టరేట్ ఏరియా, లక్ష్మీనగర్, ఆటో నగర్, జగిత్యాల రోడ్డులోని ఆర్టీసీ వర్క్ షాపు ఎదుట వరద నీరు రోడ్లపైకి చేరింది. ఉదయం కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న బస్సు ఆర్టీసీ వర్క్ షాపు ఎదుట వరదలో ఆగిపోగా స్థానికుల సాయంతో బయటికి తీసుకొచ్చారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇల్లందకుంటలో జీపీ భవనం సగం వరకు మునిగింది. చొప్పదండిలో కుడి చెరువు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కట్ట వెనకాల ఉన్న హనుమాన్ గుడిలోకి వరదనీరు చేరింది. కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్ పూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీని వరద ముంచెత్తింది.  గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. బ్యాక్ వాటర్ కట్ట పై నుంచి ప్రవహిస్తుండడంతో ముంపు గ్రామాలైన చర్లపల్లి, ఇస్తారిపల్లి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

వేములవాడ:  వేములవాడ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నుంచి కరీంనగర్ వెళ్లే రహదారి నాంపల్లి వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శాత్రాజుపల్లి వద్ద రోడ్డు తెగిపోవడంతో,జగిత్యాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వేములవాడలో ఎస్పీ అఖిల్​ మహజన్​  వరద పరిస్థితిని . 
పరిశీలించారు.

జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంతోపాటు కోరుట్ల, మెట్‌పల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెట్‌పల్లి మండలం మేడిపల్లి పెద్దచెరువు కట్ట తెగిపోవడం తో నేషనల్ హైవే 63 పై భారీగా వరద నీరు చేరింది. జగిత్యాల నుంచి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాలలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగించేందుకు వచ్చిన సిబ్బందిని ఇంటి ఓనర్లు అడ్డుకున్నారు.  

ALSO READ :ఇది అబద్ధాల మార్కెట్లో తెరిచిన దోపిడీ దుకాణం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో వరి నాట్లు నీట మునిగాయి. సుల్తానాబాద్​ పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి నీళ్లు రావడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. 

రాజన్న సిరిసిల్ల: భారీ వర్షాలకు సిరిసిల్ల జలమయమైంది. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట,సంజీవయ్యనగర్, శాంతినగర్, పాత బస్టాండ్, అంబేడ్కర్ నగర్, శ్రీనగర్ కాలనీలు నీటి మునిగాయి. చిన్నాబోనాల చెరువు తెగి పాతబస్టాండ్ నుంచి కొత్త చెరువు వరకు రోడ్‌పై నీరు నిలిచింది. కరీంనగర్, కామారెడ్డికు రాకపోకలు నిలిపివేశారు. కొత్త చెరువు ఔట్ ఫ్లో వాటర్  రోడ్ పై నుంచి ప్రవహించడంతో  శాంతినగర్, శ్రీనగర్ కాలనీలు నీటి మునిగాయి.