
- ఉమ్మడి జిల్లాలో 5,660 మంది స్టూడెంట్స్కు ఇబ్బందులు
- అధికారుల పరీక్షల్లో వెల్లడి.. ప్రస్తుతం రెండో దశలో స్క్రీనింగ్
- అవసరమైన వారికికళ్ల జోళ్లు, ఆపరేషన్లు
ఖమ్మం, వెలుగు:ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా మంది కంటి చూపు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. బోర్డుపై రాస్తున్న పాఠాలను చూసేందుకు కూడా తిప్పలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉన్నట్టు గుర్తించిన ఆఫీసర్లు గతేడాది ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతేడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) టీమ్ లతో కంటి వైద్య నిపుణులు ఈ పరీక్షలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో 5,660 మందిస్టూడెంట్స్కు సమస్య...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,89,784 మందిని పరీక్షించగా, 5,660 మంది విద్యార్థులు కంటి చూపునకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. వారందరికీ ఈనెల 17 నుంచి రెండో దశలో పరీక్షలు చేయడం ప్రారంభించారు. రోజుకు యావరేజీగా 200 మంది చొప్పున, వచ్చే నెల 15లోపు అందరికీ ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువచ్చి టెస్టులు చేస్తున్నారు. పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా అవసరమైన వారికి హైదరాబాద్ లోని సరోజిని ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించాలని నిర్ణయించారు. మిగిలిన వారికి తగిన విధంగా చికిత్స, కళ్ల జోడులను అందించనున్నారు.
ఎక్కడ.. ఎంత మంది..?
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, నేలకొండపల్లి, ఖమ్మం ఆస్పత్రుల్లో మూడ్రోజులుగా రెండో దశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా స్కూళ్ల నుంచి గుర్తించిన విద్యార్థులను ప్రత్యేక వాహనాల్లో ఆస్పత్రులకు తీసుకువచ్చి టెస్టులు చేస్తున్నారు. జిల్లాలో 1,332 స్కూళ్లలో 1,11,557 మంది విద్యార్థులను పరీక్షించగా, 3,557 మందికి కంటి సమస్యలున్నాయి. వాటి కారణంగా పుస్తకాన్ని చూసి చదవలేకపోవడం, తలనొప్పి రావడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78,227 మంది స్టూడెంట్స్ ను పరీక్షించారు. 2,103 మందికి రెండో దశలో కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని గుర్తించారు. ఈ నెల 17 నుంచి 15 రోజులపాటు భద్రాచలం, కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ 250 మందికి ఈ రెండు సెంటర్లలో కంటి పరీక్షలు చేయనున్నారు.
స్మార్ట్ ఫోన్లు, పోషకాహార లోపమే కారణం
విద్యార్థుల్లో కంటి సమస్యలకు విపరీతమైన స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఎక్కువగా టీవీ చూడడం, పోషకాహార లోపమే కారణం. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు కూడా సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు విపరీతంగా సెల్ ఫోన్లకు అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి పిల్లలకు స్క్రీన్ టైమ్ ను తగ్గించాలి. ఫోన్లో ఆటలకు కాకుండా బయట ఆడుకునే ఆటలకు విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రస్తుతం రెండో దశలో విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నాం. అవసరమైన వారికి కళ్లజోడ్లు, ఆపరేషన్లు అవసరమైన వారిని హైదరాబాద్ కు తరలిస్తాం.