కిచెన్​ తెలంగాణ : మీకు తెలుసా..చక్కెర, బెల్లం వాడకుండా కూడా స్వీట్లు చేయొచ్చు

కిచెన్​ తెలంగాణ : మీకు తెలుసా..చక్కెర, బెల్లం వాడకుండా కూడా స్వీట్లు చేయొచ్చు

దీపావళికి టపాసులు ఎంత ఫేమసో.. స్వీట్లు కూడా అంతే ఫేమస్​. నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్లంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. కాకపోతే చక్కెర వాడాలంటే ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది బెల్లం, షుగర్​ఫ్రీ వంటివి వాడుతున్నారు. కానీ చక్కెర, బెల్లం వాడకుండా కూడా స్వీట్లు చేయొచ్చు. మరింకెందుకాలస్యం..  ఈ దీపావళిని హెల్దీ స్వీట్​ఫెస్టివల్​గా మార్చేయండి.

క్యారెట్ హల్వా

కావాల్సినవి :

క్యారెట్ తురుము : అర కిలో
కర్జూరాలు : అర కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్
పాలు : రెండు కప్పులు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
పిస్తా, జీడిపప్పులు : మూడు టేబుల్ స్పూన్లు
వేడి నీళ్లు : సరిపడా

తయారీ : చిన్న గిన్నెలో కర్జూరాలు వేసి వేడి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో క్యారెట్​ తురుము వేసి అందులో పాలు పోయాలి. మూతపెట్టి ఉడికించాలి. అందులో నెయ్యి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ పలుకులు, కర్జూర గుజ్జు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. ఈ హల్వా వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది. 

బీట్​రూట్ – డేట్స్ ఎనర్జీ బైట్స్

కావాల్సినవి :

బీట్​రూట్ ముక్కలు, ఓట్స్, కర్జూరాలు : ఒక్కోటి అర కప్పు చొప్పున
కోకో పౌడర్ : నాలుగు టేబుల్ స్పూన్లు (తీపి లేనిది)
తేనె : రెండు టేబుల్ స్పూన్లు
లెమన్ జెస్ట్ (నిమ్మ తొక్క తురుము) :  అర టీస్పూన్
బాదం పలుకులు : పావు కప్పు
వెనీలా ఎక్స్​ట్రాక్ట్ : ఒక టీస్పూన్
ఉప్పు : చిటికెడు
అవిసె గింజలు, చాకొలెట్ వర్మిసెల్లి : ఒక్కో టేబుల్ స్పూన్
మ్యాపెల్ సిరప్ : రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : నూనె లేకుండా ఓట్స్ వేగించి ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో బాదం పలుకులు వేగించి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో బీట్​రూట్ తొక్క తీసి, ఉడికించిన ముక్కలు, కర్జూరాలు, ఓట్స్ వేసి కలపాలి. అందులో కోకో పౌడర్, బాదం పలుకులు, వెనీలా ఎక్స్​ట్రాక్ట్​, ఉప్పు, తేనె, లెమన్ జెస్ట్​ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్​ మోతాదులో చేతిలోకి తీసుకుని ఉండలు చేయాలి. ఆ ఉండల్లో  కొన్నింటికి కోకో పౌడర్, అవిసె గింజలు లేదా వర్మిసెల్లి వంటివి అద్దాలి. తయారుచేసిన వీటిని కాసేపు ఫ్రిజ్​లో పెట్టి ఆ తర్వాత తింటే టేస్ట్ బాగుంటాయి. 

మిల్లెట్ ఖీర్

కావాల్సినవి :

పాలు : ఆరు కప్పులు
ఊదలు (బార్న్​యార్డ్ మిల్లెట్) : పావు కప్పు
నెయ్యి, యాలకుల పొడి : ఒక్కోటి అర టీస్పూన్
బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్షలు : ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్లు
పిస్తాపప్పులు : రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు : చిటికెడు
కర్జూరాలు (గింజలు తీసేసి) : అర కప్పు

తయారీ : ఒక కప్పు  వేడి పాలలో కర్జూరాలు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి ఊదలు వేసి వేగించి ఒక ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో పాలు పోసి అందులో వేగించిన ఊదలు కలపాలి. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, కుంకుమ పువ్వు వేసి కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక యాలకుల పొడి, ఎండు ద్రాక్షలు వేసి కలపాలి. ఆఖర్న రెడీ చేసుకున్న కర్జూర పేస్ట్​ కూడా వేసి కలపాలి. అవసరమనిపిస్తే డ్రైఫ్రూట్స్, కుంకుమపువ్వు మరోసారి పైనుంచి చల్లుకుని తినొచ్చు.

మఖానా మోదక్

కావాల్సినవి :

నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
మఖానా (తామర గింజలు) : ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు, బాదం : రెండూ కలిపి పావు కప్పు
కర్జూరాలు : ముప్పావు కప్పు

తయారీ : ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో మఖానా వేగించి ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో నూనె వేయకుండా జీడిపప్పులు, బాదం వేగించాలి. మఖానాను మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేసి పక్కన  పెట్టాలి. తర్వాత కర్జూరాలు వేసి గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జును ఒక గిన్నెలో వేసి అందులో  గ్రైండ్ చేసిన జీడిపప్పు, బాదం, మఖానా పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని మోదక్​ మౌల్డ్​లో పెట్టి వత్తాలి. లేదంటే మీకు నచ్చిన షేప్​ మౌల్డ్​లో కూడా వేసుకోవచ్చు.

బేసన్ లడ్డు

కావాల్సినవి :  

నెయ్యి : రెండు టీస్పూన్లు
శెనగపిండి : అర కప్పు
కర్జూరాలు, ఎండుద్రాక్ష, జీడిపప్పులు, బాదం : ఒక్కోటి పది చొప్పున

తయారీ : నెయ్యి వేడి చేసి అందులో శెనగపిండి వేగించి పక్కన పెట్టాలి. మరో పాన్​లో నెయ్యి వేడి చేసి గింజలు తీసేసి, చిన్న ముక్కలుగా చేసిన కర్జూరాలు వేగించాలి. అందులో ఎండుద్రాక్షలు కలపాలి. బాదం, జీడిపప్పులు పొడి, యాలకుల పొడి కూడా కలపాలి. అవన్నీ బాగా కలసిపోయేవరకు కలిపి చివరిగా శెనగపిండి కూడా వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత మిశ్రమం కాస్త వేడిగా ఉండగానే లడ్డూలా చేయాలి.