- రెండు రోజుల్లో 6 వేల ఎకరాలు గుర్తింపు
- రైతుభరోసా నుంచి గుట్టలు, వెంచర్లు, ఫాంహౌస్ల డాటా తొలగింపు
యాదాద్రి, వెలుగు :పంటలు పండించకున్నా.. పెట్టుబడి సాయం పొందిన భూముల లెక్క తేలుతోంది. సర్వే ప్రారంభించిన రెండ్రోజుల్లోనే వేలాది ఎకరాలు పెట్టుబడి సాయం పొందినట్టు తేలింది. వీటికి సంబంధించి వివరాలను రికార్డుల్లో నమోదు చేసుకుంటూ రైతు భరోసా డాటా నుంచి ఆ భూముల సర్వే నంబర్లను తొలగిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో భూవిస్తీర్ణం దాదాపు 8 లక్షల ఎకరాలకు పైబడి ఉండగా, సాగుకు పనికొచ్చే భూమి 6 లక్షల ఎకరాల వరకు ఉంది. ఈ భూమిలో సుమారుగా 4.50 లక్షల ఎకరాల్లో తోటలు సహా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.
2023 యాసంగిలో జిల్లాలోని 2,48,536 మంది రైతులకు 5,87,360 ఎకరాలకు రూ.5 వేల చొప్పున రూ.293.68 కోట్లు రైతుబంధు అందించారు. అయితే ఈ సీజన్నుంచి పంటలు సాగు చేస్తున్న రైతులకే రైతుభరోసా అందించాలని, 2023 యాసంగి సీజన్లబ్ధిదారుల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వేయర్లు, అగ్రికల్చర్డిపార్ట్మెంట్స్టాఫ్సర్వే చేస్తున్నారు.
గుట్టలు, వెంచర్లు, ఫాంహౌస్లకు రైతుబంధు..
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లెక్కల ప్రకారం 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని ఉన్నప్పటికీ.. ప్రతి సీజన్లో దాదాపు 6 లక్షల ఎకరాలకు రైతుబంధు పొందుతూ వచ్చారు. రైతుభరోసా నిమిత్తం చేస్తున్న సర్వేలో జిల్లాలోని పలు మండలాల్లో గుట్టలు, వెంచర్లు చేసినప్పటికీ.. రైతుబంధు పొందుతున్నారని తేలుతోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆర్థికంగా ఉన్నవారు ఫాంహౌస్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి కూడా రైతుబంధు తీసుకుంటున్నారు. తాజా సర్వేలో ఫాంహౌస్లను పరిశీలించిన స్టాఫ్.. ఈ పరిధిలో ఎంత సాగు చేస్తున్నారో తెలుసుకొని మిగిలిన భూమిని రైతుభరోసా డేటా నుంచి తొలగిస్తున్నారు.
ఫాంలాండ్స్..
గతంలో జిల్లా వ్యాప్తంగా ఫాంలాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున రియల్ఎస్టేట్బిజినెస్ సాగింది. గుంటల చొప్పున భూమి కొనుగోలు చేస్తే రైతుబంధు వస్తుందని అప్పట్లో బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధమైన ఐదు గుంటలు, పది గుంటల చొప్పున అమ్మేశారు. ఇప్పుడీ సర్వేలో వాటిని కూడా గుర్తిస్తూ వాటి సర్వే నంబర్లను డాటా నుంచి తొలగిస్తున్నారు.
6 వేల ఎకరాలు తొలగింపు..
జిల్లాలో రెండు రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో 150 గ్రామాలకు పైగా నిర్వహించిన సర్వేలో ఎలాంటి పంటలు పండించని గుట్టలు, వెంచర్లకు సంబంధించిన దాదాపు 6 వేల ఎకరాల భూమికి రైతుబంధు పొందారని తేలింది. ఒక్క భూదాన్ పోచంపల్లి మండలంలోనే పది గ్రామాల్లో నిర్వహించిన సర్వేతో రాళ్ల గుట్టలు, వెంచర్లు కలిగిన300 ఎకరాలకు రైతుబంధు పొందుతున్నారని తెలిసింది. దీంతో ఆ భూముల సర్వే నంబర్లను రైతు భరోసా డాటా నుంచి తొలగించారు. అయితే పంటలు పండించకుండా ఎన్ని ఎకరాలకు రైతుబంధు పొందారో ఈనెల 24 నాటికి పూర్తిగా తేలిపోతుందని జిల్లాఫీసర్లు చెబుతున్నారు.