- నేపాల్‌లోని చిట్వాన్ జిల్లాలో ఘోర ప్రమాదం
- కొండచరియలు విరిగిపడడంతో దారుణం
- గల్లంతైన వారిలో ఏడుగురు ఇండియన్లు
- రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు
ఖట్మాండు: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 65 మంది గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారిలో ఏడుగురు ఇండియన్లు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో చిట్వాన్ జిల్లా నారాయణ్‌ఘాట్ – ముగ్లింగ్ హైవే వెంట ఉన్న సిమల్తాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తున్నది. ఖట్మాండు ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ఆపేయడంతో.. ప్రయాణికులంతా రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. గల్లంతైన వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. కాగా, అదే రూట్లో మరోచోట కూడా బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో డ్రైవర్ చనిపోయాడు.
బయటికి దూకేసిన ముగ్గురు ప్రయాణికులు
24 మంది ప్రయాణికులతో ఏంజెల్ బస్సు గౌర్ నుంచి ఖట్మాండుకు బయల్దేరింది. 41 మంది ప్యాసింజర్లతో గణపతి డీలక్స్ బస్సు ఖట్మాండు నుంచి గౌర్‌కు వెళ్తున్నది. రెండు బస్సులు నారాయణ్‌ఘాట్ – ముగ్లింగ్ హైవే మీదుగా ప్రయాణిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రెండు బస్సులు సిమల్తాల్ వద్దకు చేరుకోగానే వాటిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. గణపతి డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్యాసింజర్లు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ, నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.
నారాయణ్‌ఘాట్ హైవేపై ట్రాఫిక్ జామ్
ఈ ప్రమాదంలో ఏడుగురు ఇండియన్లు గల్లంతయ్యారు. వారిని సంతోష్ ఠాకూర్, సురేంద్ర షా, అదిత్ మియా, సునీల్, షానవాజ్ ఆలం, అన్సారీగా గుర్తించారు. మరో వ్యక్తి గురించి ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు.. కొండచరియల కారణంగా నారాయణ్‌ఘాట్ – ముగ్లింగ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రమాదం విచారకరం: నేపాల్ ప్రధాని
బస్సుల గల్లంతుపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. 60 మందికి పైగా గల్లంతు కావడం బాధాకరమన్నారు. అందరినీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.